హైద్రాబాద్‌పై మర్చిపోండి, ఏదో ఓరోజు సిఎం పోస్ట్: విహెచ్
హైదరాబాద్/నల్గొండ: సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే మాటను మర్చిపోవాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు గురువారం అన్నారు. సీమాంధ్ర నేతలు హైదరాబాదును యూటి చేయాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు.
రాయల తెలంగాణ ప్రతిపాదన తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆమోదయోగ్యం కాదన్నారు. ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కించపరుస్తున్నా అధిష్టానం ఓర్పుతో ఉందన్నారు. బిసి వర్గం ప్రజలకు ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జ్యోతిరావుపూలే జయంతి సందర్భంగా గురువారం ఉదయం గాంధీ భవన్‌లో విహెచ్, మంత్రి బస్వరాజు సారయ్య తదితరులు నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడితే మేము ఆపుతున్నామని, అశోక్ మాట్లాడితే మీరు నోరు మూయిస్తారా అని ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలతో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో భూములు మిగల్లేదని, ఇంకా రాయల తెలంగాణ ఎందుకన్నారు.
శీతాకాల సమావేశాల్లోనే: గుత్తా
హైదరాబాదు విషయంలో సీమాంధ్రుల అపోహలు తొలగించేందుకు కేంద్రం యోచిస్తోందని పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడతారన్నారు. హైదరాబాద్ యూటి, రాయల తెలంగాణ అన్నీ అపోహలే అన్నారు. సిడబ్ల్యూసి ప్రకటన మేరకే జివోఎం నివేదిక ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications