నారా భువనేశ్వరి గొప్ప మనసు: నాడు రెండు జతల గాజులు..నేడు?
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి ఈ క్యాంటీన్‌ను ప్రారంభించారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటయిన తొలి క్యాంటీన్ ఇదే. అందుకే చంద్రబాబే లాంఛనంగా ప్రారంభించడానికి పూనుకున్నారు. అనంతరం స్వయానా వడ్డించారు. గుడివాడ మున్సిపల్ పార్క్ వద్ద ఈ క్యాంటీన్ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పలువురు టీడీపీ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. నేడు గుడివాడలో తొలి అన్న క్యాంటీన్ ఆరంభమైంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 99 అన్న క్యాంటీన్లు ఆరంభం కానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు.. వాటిని ఎక్కడికక్కడ ప్రారంభించనున్నారు.
తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీలను సైతం ఇచ్చిన విషయం తెలిసిందే. వాటి పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలపై చంద్రబాబు తొలి సంతకం చేశారు కూడా.
అన్నా క్యాంటీన్ల కాన్సెప్ట్‌ను తమిళనాడు తొలిసారిగా అమలు చేసింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయిదు రూపాయలకు ఉదయం టిఫిన్, 10 రూపాయలకు మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో అమ్మ క్యాంటీన్లు పేరుతో వాటిని ఏర్పాటు చేసింది అప్పట్లో.
దీన్ని 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో అమలు చేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల అవి మూతపడ్డాయి. దీన్ని పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి.
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా- చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ మొత్తంతో కూడిన చెక్కును మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, అక్షయపాత్ర నిర్వాహకులకు అందజేశారు.












Click it and Unblock the Notifications