ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్..!!
ఈ నెల 30వ తేదీన శ్రీరామ నవమి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కన్నులపండువగా రాములోరి కల్యాణ వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఏర్పడే ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనడానికి ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
అమరావతి: ఈ నెల 30వ తేదీన శ్రీరామ నవమి (Sri Rama Navami). రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కన్నులపండువగా రాములోరి కల్యాణ వేడుకలు జరుగుతాయి. దీనికోసం ఆలయాలన్నీ ముస్తాబు కానున్నాయి. ఈ నెల 22వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది (Ugadi). తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాల్లో శ్రీరామ నవమి (Rama Navami) వేడుకలు ఆరంభమౌతాయి. వారం రోజుల పాటు అవి కొనసాగుతాయి. ఆలయాలన్నీ కూడా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని సంతరించుకోనున్నాయి.

ప్రయాణికుల రద్దీ..
ఈ సందర్భంగా ఏర్పడే ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనడానికి ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. ఏయే మార్గాల్లో ప్రయాణికుల తాకిడి ఉంటుందనే విషయంపై రీజినల్, డివిజినల్ మేనేజర్ల నుంచి నివేదికలను తెప్పించుకుంటోన్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి- ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను (Special Buses) అందుబాటులోకి తీసుకుని రావడంపై దృష్టి సారించారు.

భద్రాచలం.. ఒంటిమిట్ట
శ్రీరామ నవమి అనగానే గుర్తుకొచ్చేే ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు తెలంగాణలోని భద్రాచలం (Bhadrachalam), కడప (Kadapa) జిల్లాలోని ఒంటిమిట్ట (Vontimitta). ఈ రెండు చోట్ల కూడా సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ఆయా రాష్ట్రాల దేవాదాయ శాఖ అధికారులు. భద్రాచలంలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

30 నుంచి బ్రహ్మోత్సవాలు..
కడప జిల్లాలోని ఒంటిమిట్ట (Vontimitta)లో శ్రీరామ నవమి నుంచే కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమౌతాయి. ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 3వ తేదీన హనుమంత వాహనం, 4వ తేదీన గరుడవాహనం, 5వ తేదీన సీతారాముల కల్యాణ వేడుకలను నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan)- స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. 6వ తేదీన రథోత్సవం, 8న చక్రస్నానం, 9న పుష్పయాగం నిర్వహిస్తారు.

ప్రత్యేక సర్వీసులు..
ఈ వేడుకలను కళ్లారా తిలకించడానికి వేలాదిమంది భక్తులు అటు భద్రాచలం, ఇటు ఒంటిమిట్టకు వెళ్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ రెండు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు. దీనికి అవసరమైన ఆన్ లైన్ బుకింగ్ కూడా మొదలైంది. భక్తులపై ఎలాంటి అదనపు ప్రయాణ భారం పడకుండా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

30 మంది కంటే ఎక్కువ మంది ఉంటే..
దీనితో పాటు మరో ఆఫర్ ను కూడా ప్రకటించింది. 30 మంది కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒక బృందంగా ఏర్పడి బస్సును బుక్ చేసుకోగలిగితే- వారు కోరుకున్న విధంగా, షెడ్యూల్ తో సంబంధం లేకుండా బస్సును నడిపించనున్నారు. శ్రీరామ నవమి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దఫా కొత్తగా ఈ సౌకర్యాన్ని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు కల్పించారు. వారు కోరినట్లుగా ఆ బస్ సర్వీస్ ను నడిపిస్తారు.












Click it and Unblock the Notifications