విజయవాడలోని మరో స్టేషన్ లో ఈ 6 రైళ్లకు స్టాప్..! ఈ తేదీల్లో స్పెషల్..
ఏపీలోని విజయవాడ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే ఓ ఆరు రైళ్లకు మరో స్టేషన్ లో ప్రత్యేకంగా ఒక్క నిమిషం పాటు హాల్ట్ ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. నగరంలో జరిగే గుణదల మేరీ మాత ఉత్సవాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రైస్తవ సోదరుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 9 నుంచి 11 వరకూ మూడు రోజుల పాటు ఆరు రైళ్లు ఇలా ఆ స్టేషన్లోనూ ఒక్క నిమిషం పాటు ఆగబోతున్నాయి.
ఈ నెల 9 నుంచి 11 వరకూ విజయవాడ గుణదలలోని మేరీ మాత ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే విజయవాడతో పాటు నగరంలోని రామవరప్పాడు రైల్వే స్టేషన్ లోనూ ఆరు రైళ్లకు హాల్ట్ ఇచ్చింది. ఇందులో విజయవాడ-నరసాపూర్, విజయవాడ-మచిలీపట్నం మధ్య రాకపోకలు సాగించే రెండు రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో నాలుగు రైళ్లు ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఈ నెల 9, 10 తేదీల్లో పూరీ-తిరుపతి మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 1.15కు రామవరప్పాడు స్టేషన్ లో ఆగనుంది. అలాగే తిరుపతి-పూరీ మధ్య రాకపోకలు సాగించే మరో రైలు ఈ నెల 10, 11 తేదీల్లో సాయంత్రం 6.25కు ఈ స్టేషన్ లో ఆగనుంది. బిలాస్ పూర్-తిరుపతి మధ్య నడిచే మరో రైలు ఈ నెల 8న మధ్యాహ్నం 1.16కు రామవరప్పాడులో ఆగనుంది. అలాగే తిరుపతి-బిలాస్ పూర్ రైలు ఈనెల 9న సాయంత్రం 6.25కు ఇక్కడ ఆగుతుంది. వీటితో పాటు విజయవాడ-నరసాపూర్ పాసింజర్ రైలు 9, 10, 11 తేదీల్లో రాత్రి 8.38కి రామవరప్పాడులో ఆగనుంది. అలాగే మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే మరో రైలు ఉదయం 5.34కి రామవరప్పాడులో ఆగుతుంది.












Click it and Unblock the Notifications