ఉల్లిధరలు సెంచరీ కొడతాయా? ఉల్లి ధరల పెరుగుదలకు కారణాలివే!!
దేశంలో టమాటాలు, కూరగాయలు మాత్రమే కాదు ఉల్లిపాయలు కూడా మంట పుట్టిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో ఉల్లిపాయల ధరలు పెరిగాయి. కిలో 15 రూపాయలు పలికిన ఉల్లి ధరలు 20 రూపాయల నుండి 25 రూపాయలకు చేరుకున్నాయి. నాలుగు రోజుల్లోనే ఉల్లిపాయల ధరలు 10 రూపాయిలు పెరగడం సామాన్యులకు షాకింగ్ వార్తగా మారింది.
అసలు ఉల్లిపాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎంత వరకు పెరిగే అవకాశం ఉంది? కేంద్ర వర్గాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం. టమాటాలు 120 రూపాయలకు చేరిన చేదు వార్త మరిచిపోకముందే ఉల్లిపాయల ధరల మోత కన్నీరు తెప్పిస్తుంది. ప్రతిరోజు మనం వంటకు ఉపయోగించే ఉల్లిపాయల ధరలు కూడా పెరగడం ప్రస్తుతం ఇబ్బందికర పరిణామంగానే భావించాలి. ఉల్లిపాయల హోల్ సేల్ మార్కెట్లో ధర 25 శాతం పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది.

అనేక మార్కెట్లలో శుక్రవారం క్వింటాలు ఉల్లిపాయ ధర 13 వందల రూపాయలకు చేరుకుంది. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో ఈ సంవత్సరం ఉల్లిపాయల పంట బాగా పండింది. ఫిబ్రవరి నెల చివర్లో విపరీతంగా ధరలు పడిపోయి ఉల్లిపాయలను కిలో రూపాయి, రెండు రూపాయలకు అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పుడు రైతులు ఉల్లిపాయలను రవాణా ఖర్చులు కూడా దండగ అవుతాయని రోడ్లపై పారబోసి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఉల్లిపాయల ధర మండిపోతుంది.
ఉల్లిపాయల డిమాండ్ ఎక్కువగా ఉండటం, అందుకు తగ్గట్టుగా సప్లై లేకపోవడం, అకాల వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతినడం, తగ్గిన దిగుబడి కారణంగా ప్రస్తుతం ఉల్లి ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే విపరీతంగా పెరుగుతున్న ధరలపై నియంత్రణ అవసరమని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక ముందు ముందు ఉల్లి ధర మరింత పెరిగే అవకాశముందని, ఉల్లి ధర సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం మాత్రమే కాకుండా మార్కెట్ వర్గాల అంచనా కూడా జులై నెల ఆఖరుకు ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందే ఉల్లిపాయలను కొని పెట్టుకుంటే మంచిదని పలువురు సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications