అమరావతి వేదికగా జగన్ కొత్త అస్త్రం - ప్రతిపక్షాలకు చెక్..!!
అమరావతి విషయంలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న జగన్ అమరావతి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆర్ 5 జోన్ లో 50 వేల మందికి ఇంటి స్థలాల పంపిణీ ద్వారా తమ ఓట్ బ్యాంక్ అక్కడ సుస్ధిరం చేసుకుంటున్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అండ్ కో అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టారు. అమరావతి సెంటిమెంట్ ఆ ప్రాంతంలో తమకు కలిసి వస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్న వేళ ఇది కీలక నిర్ణయంగా మారుతోంది.
జగన్ వ్యూహాత్మక అడుగులు:ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది. దీని పైన అమరావతిలో నిరసన వ్యక్తం అయింది. ప్రతిపక్ష పార్టీలు అమరావతికి అనుకూలంగా నిలిచాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇదే సమయంలో అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ ప్రాంతంలో వైసీపీ పైన రాజకీయంగా పై చేయి సాధించాలని ప్రతిపక్ష పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. ఈ సమయంలోనే అమరావతిలో ఇంటి స్థలాలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న పయత్నాలకు న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో, ఒకేసారి 50 వేల మందికి ఆర్ 5 జోన్ లో ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తం సిద్దమైంది.

పేదలకు ఇంటి స్థలాలు:అమరావతి పరిధిలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు కేటాయిస్తున్న స్థలాల్లో రెండు జిల్లాల పేదలు ఉన్నారు. ఈనెల 26న లబ్దిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదగా పట్టాల పంపిణీ జరగనుంది. ఇప్పటికే ఆర్ - 5 జోన్‌లో 1,134 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడతలో 268 ఎకరాలను కేటాయించారు. ఆర్ 5 జోన్ పైన స్థానిక రైతులు న్యాయ స్థానికి వెళ్లారు. కానీ, వారికి అనుకూల తీర్పు రాలేదు. దీంతో ప్రభుత్వం ముందుగా స్థలాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సీఎం జగన్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావించారు. పేదల వ్యతిరేకంగా చంద్రబాబుగా అభివర్ణించారు.
ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు:సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగా 5024 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని.. ఇది దేశ చరిత్రలోనే రికార్డుగా పేర్కొన్నారు. అర్హులను గుర్తించి పారదర్శకంగా ఇళ్ల పంపిణీ చేయటంలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలోని పేదలకు ఏమాత్రం ప్రవేశం లేని ఒక గేటెడ్ కమ్యూనిటిని గవర్నమెంట్ డబ్బుతో కట్టుకోవాలని చుట్టూ ఒక భారీ రియల్ ఎస్టేట్ ద్వారా లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు స్కెచ్ వేసారని ఆరోపించారు. జగన్ పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించలేని పరిస్థితి. దీని ద్వారా ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టారు.

అమరావతి పై సీఎం క్లారిటీ:ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం వేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో పర్యటించనున్నారు. తాను అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. అమరావతిలోనే చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించనున్నారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో తన ఓటు బ్యాంకును పెంచుకొనే వ్యూహాలకు పదును పెట్టారు. తాజాగా సీఎం తీసుకుంటున్ నిర్ణయాలతో అమరావతి ప్రాంతంలో పై చేయి సాధించేలా జగన్ వ్యూహాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications