మామిడికాయ ఎండు నెత్తళ్ల కూర.. ఇలా చేస్తే అద్భుతః!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో మరియు పల్లెటూళ్లలో ఎంతో ఇష్టంగా వండుకునే సాంప్రదాయక వంటకాల్లో మామిడికాయ ఎండు నెత్తళ్ల కూర ఒకటి. ఎండుచేపల ఘాటుకు, పచ్చి మామిడికాయలోని పులుపు తోడైతే వచ్చే రుచే వేరు. ముఖ్యంగా వేసవి కాలంలో పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు ఈ కాంబినేషన్‌తో వండే కూర అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. నోటికి ఎంతో రుచిని, కారాన్ని అందించే ఈ నాన్-వెజ్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
కావలసిన పదార్థాలు:
ఎండు నెత్తళ్లు– 1 కప్పు
పచ్చి మామిడికాయ ముక్కలు – 1 కప్పు (పులుపును బట్టి సర్దుబాటు చేసుకోవాలి)
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 3 (పొడవుగా కట్ చేసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
పసుపు – అర టీస్పూన్
కారం – 2 నుండి 3 టీస్పూన్లు (ఈ కూరకు కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది)
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – అర టీస్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం:
ఎండుచేపల వంటకాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది వాటిని శుభ్రం చేయడం. ముందుగా ఎండు నెత్తళ్ల తల భాగాలను వేరు చేసి పక్కన పారేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోసి, ఈ నెత్తళ్లను 5నుండి 10నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటికి ఉన్న ఇసుక, మైల పూర్తిగా తొలగిపోతాయి. అనంతరం రెండు, మూడు సార్లు చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, నీరంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
ఎండు నెత్తళ్ళ కూర చెయ్యాలంటే ఇలా చెయ్యాలి
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్లను వేసి, పచ్చి వాసన పోయి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు తక్కువ మంటపై దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
మామిడికాయని ఇలా వండుకుంటే టేస్ట్
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి ముక్కలుగా కోసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను పాన్‌లో వేయాలి. మామిడికాయ ముక్కలు కాస్త మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు , కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
ఘాటుగా, పుల్లపుల్లగా ఉండే మామిడికాయ ఎండు నెత్తళ్ల కూర సిద్ధం
మసాలాలన్నీ ముక్కలకు పట్టిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు నెత్తళ్లను ఇందులో వేసి నిదానంగా కలపాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా సుమారు ఒక కప్పు నీళ్లు పోసి, మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు 8-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మామిడికాయ పులుపు, మసాలాలు నెత్తళ్లకు పట్టి కూర చిక్కగా మారుతుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో ఘాటుగా, పుల్లపుల్లగా ఉండే మామిడికాయ ఎండు నెత్తళ్ల కూర సిద్ధం. దీనిని వేడివేడి అన్నంలోకి తింటే ముద్ద ముద్దకు అమృతంలా ఉంటుంది.













Click it and Unblock the Notifications