జగన్ ఇమేజ్ పెంచుతున్న కేంద్రం, ఆధారాలతో సహా - మారుతున్న లెక్కలు..!!
ఏపీలో ఎన్నికల వ్యూహాలు పైకి కనిపించినంత సులభంగా లేవు. పొత్తుల లెక్కల వెనుక అనేక ఎత్తులు ఉన్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన కలవటం ఖాయమైనా, బీజేపీ పాత్ర స్పష్టం కావటం లేదు. ఈ సమయంలో పవన్ ను దగ్గరకు తీసిన బీజేపీ, టీడీపీతో దూరంగానే ఉంటోంది. టీడీపీ, బీజేపీని కలిపేందుకు పవన్ ప్రయత్నిస్తున్నా..చంద్రబాబు వేచి చూసే ధోరణితో ఉన్నారు. జరుగుతున్నది పూర్తిగా టీడీపీ అధినేతకు క్లారిటీ ఉంది.
జగన్ కు మద్దతుగా కేంద్రం: ఏపీలో పాలన పైన టీడీపీ, బీజేపీ, జనసేన నిత్య విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో సంక్షేమం గురించి మాత్రం ఆచి తూచి స్పందిస్తున్నాయి. పాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ మధ్య కాలంలోనే కేంద్రం నుంచి జగన్ ప్రభుత్వం పైన ప్రశంసలు వస్తున్నాయి. గణాంకాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్దిక సంవత్సరంలో ఏపీ కోరిన విధంగా రుణ సేకరణకు ప్రత్యేక అనుమతులు.. చంద్రబాబు ఎంతగా అడిగినా పట్టించుకోని రెవిన్యూ లోటు నిధులు ఇప్పుడు విడుదల చేయటం ప్రతిపక్షాలకు రుచించటం లేదు. బీజేపీతో పొత్తు కట్టిన జనసేన, పొత్తు కోసం వేచి చూస్తున్న టీడీపీకి ఈ పరిణామాలతో జగన్ కు కేంద్రం అండగా ఉందనే అభిప్రాయంతో ఉన్నాయి.
పెరుగుతున్న జగన్ ఇమేజ్: తాజాగా కేంద్రం జగన్ హాయంలో ఏపీలో గతం కంటే పెట్టుబడులు పెరిగాయని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. పూర్తి గణాంకాలను విడుదల చేసింది. జగన్ ప్రభుత్వంలో అసలు పెట్టబుడులు వెళ్లిపోతున్నా యనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం రాజ్యసభలోగతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు వచ్చాయని ప్రకటించింది. ఏపీలో జగన్ పాలనలో పేదరికం తగ్గిందని నీతి అయోగ్ నిర్ధారించింది.
2016లో ఏపీలో పేదరికం రేటు 11.7 శాతం ఉండగా 2021 నాటికి అది 6.06 శాతానికి తగ్గిందని వెల్లడించింది. ప్రభుత్వ పథకాలు మేలు చేసాయని పేర్కొంది. ఇక సుదీర్ఘ కసరత్తు తరువాత ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సీపీఎస్ స్థానంలో ఖరారు చేసిన జీపీఎస్ ను కేంద్రం అధ్యయనం చేస్తోందని..ఈ తరహాలోనే ప్రకటనకు సిద్దం అవుతోంది జాతీయ మీడియా రిపోర్టు చేసింది.

భవిష్యత్ సంబంధాలపై ఉత్కంఠ: ఇక, ఇప్పుడు ఎన్నికల సమయంలో కీలక బిల్లుల ఆమోదం కేంద్రానికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వీటి ఆమోదంలో రాజ్యసభలో వైసీపీ మద్దతు తప్పనిసరిగా బీజేపీ కోరుకుంటోంది. ఇదే సమయంలో ఎన్డీఏలో జనసేన కొనసాగుతూ టీడీపీ చేరిక కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో జగన్ కేంద్రం వద్ద పట్టు బిగిస్తున్నారు. తెలంగాణ నుంచి టీడీపీతో మద్దతు అంశంలో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ను ఓడించటమే లక్ష్యంగా 2014 తరహాలో మూడు పార్టీల పొత్తులను ప్రతిపాదించటం పైన ఢిల్లీలోని బీజేపీ ముఖ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీతో కలవటానికి అదే అడ్డంకిగా మారుతోంది. కలవటమా లేదా అనేది ఏ నిర్ణయమైనా జగన్ తో భవిష్యత్ సంబంధాలపైన నిర్ణయం ఆధారంగా తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పుడు కేంద్రంలో జగన్ ఇమేజ్ పెంచేలా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు జట్టు కడుతున్న ప్రత్యర్ధి పార్టీలకు అంతు చిక్కటం లేదు.












Click it and Unblock the Notifications