ఢిల్లీ కేంద్రంగా సీఎం జగన్ ఎలక్షన్ స్కెచ్ - పొత్తు రాజకీయంలో బిగ్ ట్విస్ట్..!!
ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా ప్రత్యర్ధి పార్టీలు ఏకం అవుతున్నాయి. పొత్తులు దాదాపు ఖరారు అయ్యాయి. ఇటు సంక్షేమ ఓట్ బ్యాంకు పెంచుకుంటూనే సీఎం జగన్ ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అపోషిజన్ పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా పావులు కదుపుతున్నారు. పార్లమెంట్ లో వైసీపీ వేస్తున్న అడుగులు రాజకీయంగా ఆసక్తి కరంగా మారాయి.
సీఎం జగన్ వై నాట్ 151:ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కేంద్రానికి అవసరమైన సమయంలో పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ రోజున రాజ్యసభలో ఢిల్లీ బిల్లు విషయంలో వైసీపీ మద్దతుతోనే కేంద్రం బిల్లు నెగ్గించుకుంటోంది. ఈ సమయంలోనే జగన్ ను ఓడంచటమే లక్ష్యమని చెబుతున్న పవన్ ఎన్డీఏలో భాగస్వామి గా ఉన్నారు. టీడీపీ- బీజేపీ కలిసేలా పవన్ చొరవ తీసుకుంటున్నారు. బీజేపీ అందుకు అంగీకరించకుంటే పవన్ టీడీపీతోనే వెళ్తారనే ప్రచారం సాగుతోంది. పొత్తు కుదిరితే 2014 తరహాలో జగన్ టార్గెట్ గా మూడు పార్టీలు ఒక్కటిగా ఎన్నికలు జరగనున్నాయి.

ఢిల్లీ కేంద్రంగా కొత్త స్కెచ్:ఈ సమయంలోనే జగన్ తాను ఒంటరిగానే బరిలోకి దిగుతానని ప్రకటించారు. ప్రతీ ఇంటికి మంచి చేసానని, అదే తనను గెలిపిస్తుందని చెబుతున్నారు. మంచి జరిగిందని నమ్మితేనే తనకు మద్దతుగా నిలవాలని జగన్ సూచిస్తున్నారు. ఈ సమయంలోనే జాతీయ స్థాయిలోనూ సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రంలో లోక్ సభలో 22, రాజ్యసభలో వైసీపీకి సభ్యుల మద్దతు ఉంది. పెద్దల సభలో కేంద్రం తీసుకొస్తున్న బిల్లు లకు పలు సందర్భాల్లో వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. అదే విధంగా కేంద్రం నుంచి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను సాధిస్తున్నారు. జగన్ తో బీజేపీ అగ్రనేతల సంబంధాలతో టీడీపీ ఇప్పుడు బీజేపీతో జత కట్టాలా..పొత్తుతో లాభమా - నష్టమా అనే మీమాసంలో పడింది.
ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేలా:ఇటు టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్న సమయంలో వైసీపీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా పైన ప్రయివేటు బిల్లు ప్రవేశ పెట్టింది. ఎలాగైనా చర్చకు వచ్చేలా చూడాలని భావిస్తోంది. పార్లమెంట్ బయటా ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివీటీకరణ రద్దు, పోలవరం కు సవరించిన అంచనాల ఆమోదం పైన ఒత్తిడి పెంచాలని భావిస్తోంది.

దీని ద్వారా పరోక్షంగా టీడీపీ, జనసేన ఆత్మరక్షణలో పడేలా వ్యూహం అమలు చేస్తోంది. విశాఖ రైల్వే జోన్ పైన నినదించాలని భావిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైతే తిరిగి 2018లో టీడీపీ ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు వచ్చిందో..ఆ డిమాండ్ నెరవేరకుండా ఇప్పుడు ఎందుకు పొత్తుతో వెళ్తుందో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
వ్యూహం ఫలించేనా:కేంద్రంతో వైసీపీ సఖ్యతగా ఉంటూనే, పెండింగ్ లో ఉన్న ప్రధాన డిమాండ్ల పైన ప్రతీ సందర్భంలో అమలు కోసం కోరుతున్న విషయాన్ని వైసీపీ ఎంపీలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీతో పొత్తు విషయంలో ఇదే పెద్ద అడ్డంకిగా మారుతోందని తెలుస్తోంది. దీంతో, సీఎం జగన్ ఢిల్లీ కేంద్రంగా అమలు చేస్తున్న కొత్త స్కెచ్ రాజకీయంగా ఏ మేర ఫలితం ఇస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications