ప్రతిపక్షాలపై జగన్ బ్రహ్మాస్త్రం, మూలాలే టార్గెట్ - ఏం చేయబోతున్నారు..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్దంలోకి దిగారు. పార్టీ నేతల సమక్షంలోనే తన లక్ష్యం స్పష్టం చేసారు. ఖచ్చితంగా 175 సీట్లు గెలవటమే లక్ష్యమని చాటారు. ఇందుకోసం రేపటి నుంచే కార్యాచరణ అమలుకు సిద్దం అయ్యారు. ఎన్నికల వరకు పార్టీ శ్రేణులకు విశ్రాంతి లేదని స్పష్టం చేసారు. సరిగ్గా ఎన్నికల వేళ ప్రజల మధ్యకు వేల కోట్ల పథకాలు అందించటమే లక్ష్యంగా సిద్దమయ్యారు. ప్రతిపక్షాలకు అస్త్రాలు లేకుండా చేసి..వారి పైన ఎన్నికల బ్రహ్మాస్త్రం సంధించేందుకు రెడీ అయ్యారు.
చంద్రబాబు అరెస్ట్ గురించి
టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్నారు. ఆయన అరెస్ట్ కక్ష్య పూరితం కాదని జగన్ తేల్చి చెప్పారు. తాను దేశంలో లేని సమయంలో అరెస్ట్ జరిగిందన్నారు. కేంద్రంలో బీజేపీ ఉందని, పవన్ కూడా బీజేపీతో నే ఉన్నాని చెబుతన్నారని గుర్తు చేసారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు. అయినా కేంద్రంలోని ఇన్‌కం ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబుపై విచారణ జరిపి అవినీతిని నిరూపించింది.

దోషులను అరెస్టు కూడా చేసింది. చంద్రబాబు ఇన్‌కం ట్యాక్స్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేంద్రం నోటీసులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబును సమర్ధించడం అంటే రాష్ట్రంలోని పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడమేనని వివరించారు. పవన్ కు అసలు అభ్యర్దులు..జెండా మోసే కార్యకర్తలు లేరని ఎద్దేవా చేసారు. జీవితాంతం చంద్రబాబును మోయటమే లక్ష్యమని వ్యాఖ్యానించారు.
పొత్తులపై జగన్ లెక్కలు
తాను పొత్తుల కోసం వెంపర్లాడనని స్పష్టం చేసారు. ఎంత మంది కలిసినా కూడా ..రెండు సున్నాలు కలిస్తే..నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నానే అని తేల్చి చెప్పారు. సరిగ్గా ఎన్నికల ముందు కేడర్ కు జోష్ పెంచే అంశాలను వెల్లడించారు. జవనరి 1న వృద్ధుల పెన్షన్ ప్రస్తుతం ఉన్న రూ 2,750 నుంచి మూడు వేలకు పెంచుతూ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతందన్నారు.
గ్రామ స్థాయిలో సంబరాలు అందరూ మమేకం కావాలని సూచించారు. 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వం పై నెలకు రూ 400 కోట్ల మేర పెన్షన్ భారం ఉంటే.. ఇప్పుడు నెలకు రూ 2000 కోట్లకు చేరిందన్నారు. జనవరి 10 నుంచి వైఎస్సార్ చేయూత ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 14,129 కోట్లు ఇచ్చామని.. మరో అయిదు వేల కోట్లు ఈ పది రోజుల్లో ఇవ్వనున్నట్లు వివరించారు.నాలుగేళ్లల్లో 75 వేల చొప్పున అందించామని చెప్పారు.

ఎన్నికల వేళ పథకాలతో
జనవరి 20-30వ తేదీ వరకు వైఎస్సార్ ఆసరా చివరి విడత నిధులను విడుదల నిధులు విడుదల చేస్తామన్నారు. నాలుగు విడతల్లో పొదుపు సంఘాల రుణాల 19,178 కోట్లు మూడు దఫాలు ఇచ్చాం. చివరి విడతా మరో 6,500 కోట్లు ఇవ్వనున్నాం. మొత్తంగా 26 వేల కోట్లు అందించామని చెప్పారు. ఫిబ్రవరిలో మరో జగనన్ననే తెచ్చుకుందామని... ప్రతీ ఇంటికి మేనిఫెస్టో 2024.
మార్చిలో ఎన్నికలకు సన్నద్దం కావాలని జగన్ పిలుపునిచ్చారు. ఇలా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా..సరిగ్గా ఎన్నికల వేళ సంక్షేమాన్ని పక్కాగా అమలు చేస్తూ..తన ప్రధాన ఓట్ బ్యాంక్ ను సుస్ధిరం చేసుకుంటూ.. ప్రజల మధ్యే పార్టీ శ్రేణులు ఉండేలా కార్యాచరణ సిద్దం చేసిన జగన్..ఇదే ధీమాతో వై నాట్ 175 అంటున్నారు. ఇదే జరిగితే...మరోసారి జగన్ కు అధికారం ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications