సీఎం జగన్ ట్రాక్ రికార్డులో మరో సక్సెస్ - రాష్ట్రంలోనే తొలిసారిగా..!!
ముఖ్యమంత్రి జగన్ మరో హామీ నెరవేరుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అటు సంక్షేమంతో పాటుగా పలు కీలక నిర్ణయాలతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రతీ పార్లమెంట్ నియోకవర్గంలో ఒక వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామని నాడు జగన్ హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
అయిదు కాలేజీల్లో ప్రవేశాలు:ఈ విద్యా సంవత్సరం (2023-24) ఐదు కళాశాలల్లో 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు కొద్దీ రోజుల క్రితం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఒకే ఏడాది ఐదు వైద్య కళాశాలలు ప్రారంభం అవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి..

రాష్ట్రంలో మొట్టమొదటగా 1923లో విశాఖపట్నంలో ఆంధ్ర వైద్య కళాశాల ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019కి అంటే 96 ఏళ్లలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యాయి. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైద్య విద్యా రంగం అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టారు. నాడు - నేడు పథకం కింద రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి శ్రీకారం చుట్టారు.
ఈ ఏడాది నుంచి తరగతులు:ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టాగా వీటిలో ఐదు కాలేజీల్లో తరగతులు ఈ విద్య సంవత్సరంలో ప్రారంభమవుతున్నాయి.రెండోవ దశలో పులివెందుల, పాడేరు, ఆదోని మెడికల్ కళాశాలల పనులు శేరవేగంగా కొనసాగుతున్నాయి.
ఆ తర్వాతి దశలో మిగిలిన తొమ్మిది కళాశాలలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. అంతేకాకుండా ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో మానవ వనరులు, ఇతర సదుపాయాలను సమకూర్చింది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరగనుంది.
ఎన్‌ఎంసీ అనుమతి:తొలి విడతలో విజయనగరం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం కాలేజీల నిర్మాణం పూర్తవటంతో వీటిలో అడ్మిషన్లకు ఎన్‌ఎంసీ అనుమతినిచ్చింది. ఈ కళాశాలల్లో ఆగస్టులో అడ్మిషన్లు చేపట్టి, సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభించనున్నారు.

మెడికల్ సీట్ల కోసం రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీలోనే అవకాశాలను వైసీపీ ప్రభుత్వం కల్పిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 2019కి ముందు 1,926 పీజీ సీట్లు ఉండగా, గత నాలుగేళ్లలో కొత్తగా 462 పీజీ సీట్లను ప్రస్తుత ప్రభుతం మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులతో పాటు కొత్తగా 49 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.
కొత్తగా 750 సీట్లు:రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబోతున్న వైద్య, విద్య కళాశాలల్లో 750 సీట్లు కొత్తగా రాబోతున్నట్టు మెడికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రామన్ తెలిపారు. అల్ ఇండియా కోటాలో 15 శాతం సీట్లును కేటాయించగా మిగిలిన 85 శాతం సీట్లను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పొందనున్నారన్నారు.
అలాగే వీటిలో ఓపెన్ కేటగిరిలో 50 శాతం సీట్లను, షెడ్యూల్డ్ కేటగిరిలో 15 శాతం సీట్లను, ఈడబ్ల్యూఎస్ కోటాలో 10శాతం సీట్లను కేటాయించగా ఇతర కులాల వారీగా వారి అర్హతలను బట్టి మిగిలిన 10 శాతం సీట్లను కేటాయించనున్నారని తెలిపారు. గతంలో ఒకటి, రెండు మార్కుల తేడాతో సీటు సాధించనివారు, మరీ ముఖ్యంగా సీటు రాకపోవటంతో ఆర్ధిక పరిస్థితి బాగోలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకోలేనివారికీ ఈమెడికల్ కాలేజీల వల్ల విద్యార్థులకు ఎంతగానో మేలు జరగనుందన్నారు.

రాష్ట్రంలో 2,935 సీట్లు :ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఈ సంవత్సరం ప్రారంభం కానున్న ఐదు కొత్త కళాశాలలతో మరో 750 సీట్లు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రంలో 2,935 సీట్లు ఉంటాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 750 అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు మూడోవ దశలో రానున్న తొమ్మిది మెడికల్ కాలేజీల వల్ల రాష్ట్రంలో వైద్య, విద్య సీట్లు భారీగా పెరగనుండటంతో వైద్యవిద్యా అభ్యసించాలనుకునే విద్యార్థులకు భారీగా అవకాశాలు కలగనున్నాయి.












Click it and Unblock the Notifications