మత్తయ్యని పదేపదే పరారీలో ఉన్న వ్యక్తి అనొద్దు: స్టీఫెన్ లాయర్‌కు జడ్జి
హైదరాబాద్: మత్తయ్య వ్యాజ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర రావు విచారణ నుంచి తప్పుకోవాలంటూ స్టీఫెన్ సన్ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంపై గురువారం వాదనలు ముగిశాయి. తీర్పును 29వ తేదీకి వాయిదా వేశారు.
వాదనల సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. పదేపదే పరారీలో ఉన్న వ్యక్తి అనవద్దని సూచించారు. వాదనల సమయంలో.. స్టీఫెన్ సన్ వాదనతో తెలంగాణ సర్కారు ఏకీభవించడం లేదని, ఆ విషయాన్ని ఏజీని అడిగి తెలుసుకోవాలని మత్తయ్య తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
తెలంగాణ ఏజీరామకృష్ణా రెడ్డి స్పందిస్తూ.. ఈ అంశంపై ప్రభుత్వ స్పందన అవసరం లేదన్నారు. నిర్ణయంపై విచక్షణాధికారం న్యాయస్థానాలకు ఉంటుందని చెప్పారు.

స్టీఫెన్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలువినిపిస్తూ.. పరారీలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కోర్టుకు తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ పదేపదే పరారీలో ఉన్న వ్యక్తి అనవద్దని, ఆ వ్యక్తికీ హక్కులు ఉంటాయని సూచించారు.
మరోవైపు, స్టీఫెన్ సన్ అనుబంధ వ్యాజ్యం దాఖలు చేయడాన్ని మత్తయ్య తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా తప్పుపట్టారు. స్టీఫెన్ దురుద్దేశ్యంతో ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, దానిని కొట్టివేయాలని కోరారు.
న్యాయమూర్తి ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటే ప్రతి ఒక్కరు ఇలాగే వ్యాజ్యాలు దాఖలు చేస్తారన్నారు. స్టీఫెన్ సన్ అనుమానంతో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications