పంచాయితీల్లో మొదలైన పోలింగ్ - మధ్నాహ్నం నుంచి ఫలితాలు : రేపు మున్సిపల్ ఎన్నికలు..!!
ఏపీలో పెండింగ్ లో ఉన్న పంచాయితీలకు పోలింగ్ ఆరంభమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 69 పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కపెట్టి విజేతను ప్రకటిస్తారు. ఇక రేపు నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతాయి.

నేడ పంచాయితీ.. రేపు మున్సిపల్
ఇందులో ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాల్టీలు ఉన్నాయి. 16న 15 జెడ్సీటీసీలు.. 187 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 17న ... అదే విధంగా జెడ్పీటీసీ - ఎంపీటీసీల ఎన్నికల ఫలితాలు ఈ నెల 18న నిర్వహించనున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం తో ముగిసింది.

ఈ మధ్నాహ్నం నుంచి పంచాయితీ ఫలితాలు
ఈ మొత్తం ఎన్నికల్లో అందరి కళ్లు కుప్పం మీదనే ఉన్నాయి. అక్కడ గెలుపు కోసం వైసీపీ..టీడీపీ రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కు ముందు చంద్రబాబు... ప్రచారం చివరి రెండు రోజులు లోకేశ్ కుప్పంలో ప్రచారం నిర్వహించారు. ఇక, వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో గెలుపు బాధ్యతలను తీసుకున్నారు.
అనేక వివాదాలు..ఫిర్యాదులకు కుప్పం వేదికగా మారింది. ఈ రోజు జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

పోలింగ్ వేళ కరోనా ప్రోటోకాల్
స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలన
క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు.












Click it and Unblock the Notifications