రాష్ట్రాన్ని సజ్జలరెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలకు పంచిపెట్టేసాడు జగన్ రెడ్డి: ఇంకెక్కడి బీసీలు; పంచుమర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల, మైనారిటీల పేరుతో రసవత్తర రాజకీయం సాగుతుంది. తమ పాలనలో అందరికీ సామాజిక న్యాయం జరిగిందని వైసీపీ సర్కార్ చెబుతుంటే, మీ పాలనలో చేసిన సామాజిక న్యాయం ఇదేనా అంటూ తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి రాజ్యం కొనసాగుతుందని టిడిపి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది.

ఏపీలో వైఎస్సార్సీపీ బస్సు యాత్ర.. రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ వైసీపీ కుల రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సామాజిక న్యాయం పేరుతో మంత్రుల బస్సుయాత్ర జరగనుంది. ఈ బస్సు యాత్రలో బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీ మంత్రులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర పై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సామాజిక న్యాయం పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.

జగన్మోహన్ రెడ్డి బీసీలకు న్యాయం చేశారన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు రాజ్యాధికారం ఇస్తున్న ప్రభుత్వం తమదని, జగన్మోహన్ రెడ్డి బీసీలకు న్యాయం చేశారంటూ కితాబిచ్చారు. ఏపీ కేబినెట్ లో 77 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని పేర్కొన్న ధర్మాన ప్రసాదరావు రాజ్యసభ సీటు ఒక తెలంగాణ బీసీ వ్యక్తికి ఇస్తే తప్పు పడుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రాంత వాసి అయితే... మరి చంద్రబాబు ఎక్కడున్నాడు తెలంగాణలో కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

ధర్మానకు పంచుమర్తి అనూరాధ సవాల్
ఇక ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలను జగన్ రెడ్డి ఉద్ధరించాడు అని చెప్పి ప్రజలను మభ్య పెట్టడానికి ధర్మాన చాలా తాపత్రయ పడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ధర్మాన గారిని ఒక్కటే అడుగుతున్నా.. బీసీలకు సీఎం కుర్చీ ఇవ్వొద్దు, కానీ కనీసం తన ముగ్గురు సామంత రాజుల్లో ఇద్దరి స్థానంలో బీసీలను పెట్టి చూపమనండి అంటూ సవాల్ విసిరారు.

జగన్ రెడ్డికి ఏది చెప్పాలన్నా ఈ ముగ్గురే చెప్పాలి? కాదంటారా
రాష్ట్రాన్ని సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బారెడ్డి లకు పంచి పెట్టేసాడు.. జగన్ రెడ్డికి ఏది చెప్పాలన్నా ఈ ముగ్గురే చెప్పాలి అంటూ పంచుమర్తి అనురాధ పై పంచ్ లు వేశారు. వీరి కాదంటే ఏ పెద్ది రెడ్డో, మరో రెడ్డో.. మీరు మంత్రే కదా! వీళ్ళ జోక్యం లేకుండా, వీళ్ళ అనుమతి లేకుండా నేరుగా జగన్ రెడ్డిని మీరు కలవగలరా? అంటూ ప్రశ్నించారు. ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ మా బీసీలను మోసం చేస్తారు? అంటూ పంచుమర్తి అనురాధ ధర్మాన ప్రసాదరావు ను టార్గెట్ చేశారు.