వైసీపీని నడిపిస్తోంది వారే, వైల్డ్ ఫైర్ - కూటమిపై వార్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్దం అవుతున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఆసక్తి కర రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కాగా, 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీలో ముఖ్య నేతలు ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదు. ఈ సమయంలో.. వైసీపీని డ్రైవ్ చేసే బాధ్యత లు ఆ విభాగం తీసుకుంది. పార్టీ ముఖ్యుల కంటే సమర్ధవంతంగా పని చేస్తోంది. కూటమికి సవాల్ గా నిలుస్తోంది.
సీనియర్ల నిస్తేజం
ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ లో సీనియర్లు ఇంకా ప్రజల్లోకి రావటం లేదు. జగన్ సమావేశా - పరామర్శలకు పరిమితం అయ్యారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోంది. మండలిలో మాత్రం వైసీపీ సభ్యులు కొందరు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా, కొందరు రాజ్యసభ - మండలి సభ్యులు కూటమిలోకి క్యూ కట్టారు. పార్టీ అధికార ప్రతినిధులు నామ మాత్రపు పాత్ర పోషిస్తున్నారు. కూటమి నేతలు జగన్ లక్ష్యంగా గత ప్రభుత్వ పేరుతో వరుసగా టార్గెట్ చేస్తున్నా.. పార్టీ నుంచి కనీస స్పందన ఉండటం లేదనే చర్చ ఉంది. సీనియర్లు దాదాపుగా మౌనం పాటిస్తున్నారు. ఫైర్ బ్రాండ్స్ మేమున్నమంటూ అప్పుడప్పడు మాత్రమే సీన్ లోకి వస్తున్నారు.

సోషల్ మీడియా ఫైర్
ఇదే సమయంలో కొంత కాలంగా వైసీపీకి సోషల్ మీడియా యాక్టివిస్టులు కీలకంగా మారారు. వారే కూటమిలో జరుగుతున్న పరిణామాలను బయట పెడుతున్నారు. పార్టీ నేతల కంటే క్రియాశీలకం గా పని చేస్తున్నారు. జగన్ ను ఎవరైనా ఏదైనా అంటే వెంటనే స్పందిస్తున్నారు. కూటమి నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు చెబుతున్న మాటలను వీడియోలతో పోస్టింగ్స్ పెడుతూ నిల దీస్తున్నారు. జగన్ ను విమర్శించిన సినీ ప్రముఖులను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నా రు. లైలా వంటి సినిమా ఫంక్షన్ లో 40 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ తో ఆ సినిమాకు వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ చేసారు. అదే విధంగా రాయల్ కిరణ్, టీడీపీ - జనసేనలో ఎవరైనా జగన్ ను విమర్శిస్తే.. ఒక్క సారిగా పోస్టింగ్స్ తో విరుచుకుపడుతున్నారు. ఎమోషనల్ పోస్టింగ్స్ తో కేడర్ ను కదిలించే ప్రయత్నం చేస్తున్నారు.
సీనియర్లు ఎక్కడ
తాజాగా భారతి గురించి చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో పార్టీ నేతల కంటే సోషల్ మీడియా మద్దతు దారులు ఒక రేంజ్ లో టార్గెట్ చేసారు. పార్టీలో పరిణామాల విషయంలోనూ నేరుగా ప్రశ్నిస్తున్నారు. జగన్ వారంలో మూడు రోజులే తాడేపల్లిలో అందుబాటులో ఉంటున్నారు. జగన్ కు మద్దతుగా నిలుస్తూనే.. పార్టీ నేతల తీరును నిలదీస్తున్నారు. జగన్ పర్యటన సమయం లో పార్టీ నేతల కంటే పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. చంద్రబాబు, పవన్ , లోకేష్ లక్ష్యం గా అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి నేతలకు వైసీపీలోని నాయకుల కంటే ఆ పార్టీ సోషల్ మీడియానే సమస్యగా మారింది. ఆధారాలతో సహా వారు చేస్తున్న పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో, ఇప్పుడు జగన్ వీరితో ప్రత్యేక సమావేశానికి నిర్ణయించారు. ఇప్పుడు పార్టీలో నేతలు సైతం వీరి పోస్టింగ్స్ కు అనుగుణంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications