పాకిస్తాన్ సైనికులు అసలు మనుషులేనా: పిట్టల్లా కాల్చిపడేశారు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రావల్‌కోట్ లో తీవ్ర హింస, ఉద్రిక్తతలతో నెలకొన్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తోన్న వారిపై పాకిస్తాన్ భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షాన్ని కురిపించాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా నేరుగా తుపాకులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రావల్‌కోట్ వీధులన్నీ రక్తసిక్తం అయ్యాయి.
ఈ ఘటనపై జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మృతుల సంఖ్యను ధృవీకరించింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల్లో ఇప్పటివరకు తొమ్మిది మందిని గుర్తించారు. ఉస్మాన్ నజీర్, ఖాశిఫ్, మహ్మద్ ఇబ్రహీం, అర్సల్ అస్గర్, హనీఫ్ మహ్మద్ బషీర్, వసీం అఫ్జల్, బాసిత్ షా, సాబిర్ ఖాన్ ఈ కాల్పుల్లో మరణించినట్లు ఆవామి కమిటి తెలిపింది.

కాల్పుల దుర్ఘటన అనంతరం రావల్‌కోట్‌తో పాటు పీఓకేలోని ఇతర సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అలజడులు వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్, డిజిటల్ నెట్‌వర్క్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. మొబైల్ డేటా సేవలు నిలిచిపోవడంతో పాటు విస్తృత కమ్యూనికేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేసి అదనపు సాయుధ బలగాలను రావల్‌కోట్ నగర వీధుల్లో మోహరించారు.
స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో ప్రదర్శనకారులు జరిపిన చర్చలు విఫలం కావడంతో నిరసనకారులు రావల్ కోట్ నుండి ముజఫరాబాద్ వైపు శాంతియుత మార్చ్ ప్రారంభించారు. గత 52 రోజులుగా ఇక్కడ సాగుతున్న సమ్మెలు, ఆందోళనల నేపథ్యంలో అరెస్ట్ అయిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, వారిపై మోపిన తప్పుడు కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సుదీర్ఘ పోరాటాన్ని సాగిస్తున్నారు.
పీఓకే పరిధిలోని మీర్ పూర్ డివిజన్‌లో గల 13 స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలోనే ఈ కాల్పులు చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోట్లీ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు జరగడమే కాకుండా భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications