పాస్టర్ ప్రవీణ్ మృతిపై కదిలిన ఏపీ ప్రభుత్వం: డీజీపీకి చంద్రబాబు ఫోన్ కాల్
Pastor Praveen death: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆయన మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఆయన హత్యకు గురై ఉండొచ్చనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో క్రైస్తవ మహాసభలకు హాజరు కావడానికి బుల్లెట్‌పై రాజమండ్రికి బయలుదేరిన ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉండటం, బలమైన వస్తువులతో కొట్టినట్టు కనిపించడం వల్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులెవరైనా ఆయనను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేసి ఉండొచ్చంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అటు క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ప్రభుత్ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఉదంతం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిలువెత్తు నిదర్శనమంటూ విమర్శించారు.
ఈ పరిణామాలన్నింటిపై తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఉదంతం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం… pic.twitter.com/JyntFAFn4A
— Lokesh Nara (@naralokesh) March 26, 2025
పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపిస్తామని చంద్రబాబు, నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ఫోన్‌లో మాట్లాడారని తెలుస్తోంది. సమగ్ర విచారణ జరిపించాలంటూ ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు ఆదేశించినట్లు చెబుతున్నారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేష్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని అన్నారు.
వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ ఘటన పట్ల వంగలపూడి అనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీ నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు జరపాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications