చింటూతో పావనికి లింక్: మాయలేడీ దందాలో బెదిరింపులు
చిత్తూరు: మహిళలను మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న పావని విషయంలో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిత్తూరులోని ఎస్‌బిఐ కాలనీకి చెందిన పావని గురించి పోలీసులు బాధితులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో పావని వ్యవహారాల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు స్తానిక మీడియాలో వార్తకథనాలు వచ్చాయి.
మూడేళ్లుగా పావని చిత్తూరులో చీరెల వ్యాపారం చేస్తోంది. ఆమె భర్త చరణ్ అలియాస్ చెర్రీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పావని కాలనీలోని మహిళలతో సన్నిహితంగా ఉంటూ వారి నుంచి అప్పులు తీసుకునేది. మూడేళ్ల కాలంలో చిత్తూరులోనే కాకుండా శ్రీకాళహస్తి, తదితర ప్రాంతాల్లో పలువురు మహిళల నుంచి ఆమె నగదు, ఆభరణాలు అప్పుగా తీసుకుంది.
2103 నవంబర్ నుంచి 2015 డిసెంబర్ వరకు చిత్తూరులోని ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌లో 244 ఖాతాలు తెరిచి 7.882 కిలోల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టింది. ఇందులో 1.30 కిలోల బంగారు ఆభరణాలను ముత్తూట్ ఫైనాన్స్ వేలం వేయగా, 4.308 కిలోల అభరణాలను రూ.91 లక్షలు చెల్లించి పావని విడిపించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

చిత్తూరు పోలీసులు వారం క్రితం మిగతా 1.6 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూడు నెలల క్రితం పావని శ్రీకాళహస్తి కోర్టులో ఐపి దాఖలు చేసింది. నగల యజమానులు ఆభరణాలను ఇచ్చేయాలని ఆమెపై ఒత్తిడి పెట్టారు. పావని తనను మోసగించి, 406 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్లినట్లు చిత్తూరుకు చెందిన ఓఎం రాందాస్ భార్య జోత్స్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూపీ లాగారు.
ఇదిలావుంటే, పావని హరిదాస్ ద్వారా చింటూకు వద్దకు వెళ్లి పరిచయం పెంచుకుంది. రాందాస్ భార్య జ్యోత్స్నతో పాటు పలువురు మహిళలను చింటూ బెదిరించినట్లు పోలీసు రికార్డుల్లో నమోదైందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు చింటూ, హరిదాస్, పావని, చెర్రీలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో విచారించడానికి చింటూతో పాటు హరిదాస్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. మేయర్ దంపతుల హత్యకు వారం ముందే పావనిని చింటూ బయటకు పంపించేశాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications