బుద్దప్రసాద్ కు సీటు ఖరారు - అక్కడ జనసేన అభ్యర్థి మార్పు..!!
ఏపీ ఎన్నికల రాజకీయం కీలక మలుపు తిరుగుతోంది. వైసీపీ వర్సస్ కూటమి పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అందులో పవన్ మరో రెండు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. తాజాగా అవని గడ్డ నుంచి టీడీపీ సీనియర్ నేత..తాజాగా జనసేనలో చేరిన మండలి బుద్ద ప్రసాద్ పేరును ప్రకటించారు. రాజంపేట అభ్యర్థి మార్పు పైన పవన్ కసరత్తు చేస్తున్నారు.
బుద్దప్రసాద్ కు అవనిగడ్డ
జనసేన ని పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పైన దాదాపు క్లారిటీ ఇచ్చారు. జనసేన ఇప్పటివరకు తాము పోటీ చేసే 21 స్థానాల్లో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. ఈరోజు అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ పేరును పవన్ ఖరారు చేశారు. బుద్ధ ప్రసాద్ సుదీర్ఘకాలం కాంగ్రెస్, టిడిపిలో పనిచేశారు. తాజాగా జనసేనలో చేరారు. దీంతో, అవనిగడ్డ సీటును బుద్ధ ప్రసాద్ కు కేటాయించారు. అక్కడ నుంచి జనసేన సీటు కోసం ఇక్కుర్తి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ చివరి వరకు ప్రయత్నించారు.

పార్టీ నేతల వ్యతిరేకత
అయితే, మండలి బుద్ధ ప్రసాద్ కి సీటు ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక పాలకొండ నుంచి జనసేన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అక్కడ నుంచి సీటు కోసం పోటీ ఉండటంతో ఆశావాహులతో పార్టీ నేతలు చర్చిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పాలకొండ అభ్యర్థిని పవన్ ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే జనసేన అభ్యర్థిని ఖరారు చేసిన రైల్వేకోడూరు స్థానంలో మార్పు ఖాయంగా కనిపిస్తుంది. అక్కడ జనసేన అభ్యర్థిగా ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్రపక్షం తెలుగుదేశం నుంచి అనుకూలత వ్యక్తం కావడం లేదు. దీంతో అభ్యర్థి మార్పు పైన ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతుంది.
రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు
దీంతో, ఇద్దరి పేర్ల పైన పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. వీరిలో ఒకరిని రైల్వేకోడూరు అభ్యర్థిగా పవన్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మచిలీపట్నం, కాకినాడ పార్లమెంట్ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం జ్వరం కారణంగా పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో రెండు రోజుల్లోనే పిఠాపురంలో ప్రచారం కొనసాగించడంతో పాటుగా.. తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారానికి పవన్ సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications