తుఫాను: పవన్ సహా నేతల పరామర్శల హోరు

విశాఖపట్నం: ఉత్తరాంధ్రను తాకిని భారీ తుఫాను నేపథ్యంలో రాజకీయ నాయకుల తాకిడి పెరిగింది. తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తుఫాను తీరం దాటిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలోనే ఉండి ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తుఫాను బాధితులను పరామర్శిస్తున్నారు.
విశాఖనగరంలో విడిగానూ ప్రధాని నరేంద్ర మోడీతోనూ పర్యటించిన చంద్రబాబు బుధవారంనాడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు. సహాయక చర్యలను సమీక్షిస్తూ, అధికారులకు, మంత్రులకు సూచనలు చేస్తూ ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. బుధవారంనాడు ఆయన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు.
తుఫాను తాకిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిస్పందించారు. విశాఖనగరం పర్యటనకు వచ్చి తక్షణ సహాయం కింద వేయి కోట్ల రూపాయలు ప్రకటించి, బాధితులకు నమ్మకం కలిగించారు. విశాఖలో పర్యటించి, బాధితులను పరామర్శించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారంనాడు రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన బాధితులను పరామర్శించారు. పవన్ కళ్యాణ్‌ను చూడడానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మాటలు కాదు, చేతలు కావాలని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ రాక విశాఖపట్నంలో సందడిని సృష్టించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హుదూద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించారు. బుధవారంనాడు పర్యటనలో భాగంగా జగన్ షిప్పింగ్ హార్బర్, జాలారి పేట, ఆంధ్రా యూనివర్సిటీ, పెద్ద గదిలి, ధర్మవరం, తాడిచెట్లపాలం, దుర్గగుడి, కొబ్బరితొట ప్రాంతాల్లో పర్యటించారు. హుదూద్ తుఫాను బాధితులకు వైయస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని భవనాలకు వాటిల్లిన నష్టాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఆతర్వాత హుదూద్ తుఫానులో నష్టపోయిన మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు పూర్తిగా అందే వరకు తుఫాను తాకిడి ప్రాంతాల్లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.

రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు నేత చిరంజీవి ఈ నెల 19, 20 తేదీల్లో తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ రోజుల్లో తుఫాను తాకిడికి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా తుఫాను సహాయక చర్యలపై దృష్టి పెట్టారు.












Click it and Unblock the Notifications