జగన్ కు పవన్ సవాల్..! మళ్లీ ఎలా గెలుస్తారో చూస్తా..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మరో సవాల్ విసిరారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక జగన్ పై విమర్శల తాకిడి పెంచుతున్న పవన్ ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలు చెప్పిన పవన్.. మరోసారి ఆ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ సవాల్ విసిరారు. తద్వారా వైసీపీ నేతలు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ ప్రకాశం జిల్లా నరసింహాపురంలో జల్ జీవన్ మిషన్ పనుల్ని ప్రారంభించేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. వైసీపీపై విమర్శలకు దిగారు. సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకి ఈ పరిస్ధితి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. 2029లో అధికారంలోకి వస్తే తమ అంతు చూస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, మీరు అధికారంలోకి రావాలి కదా అని పవన్ వారికి కౌంటర్ ఇచ్చారు. ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తామని పవన్ సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా తనకూ ఎవరిపైనా కక్ష ఉండదన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం లక్ష కోట్ల అప్పులు పెట్టి వెళ్లిపోతే తాము వాటిని తట్టుకుని ముందుకెళ్తున్నట్లు పవన్ తెలిపారు. వైసీపీ హయాంలో ఎలాంటి తాగునీటి పథకాలు కూడా చేపట్టలేదన్నారు. కానీ తాము జల్ జీవన్ మిషన్ పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పవన్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నుంచి సకాలంలో నిధులొస్తే 18 నుంచి 20 నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి ఆయన శంఖుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications