మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్ధి ప్రకటన..!
ఏపీలో ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ తాము పోటీ చేస్తున్న రెండో ఎంపీ సీటులోనూ అభ్యర్ధిని ప్రకటించింది. ఇప్పటికే కాకినాడ పార్లమెంటు స్ధానంలో టీటైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ఎంపిక చేసిన జనసేన.. ఇప్పుడు మచిలీపట్నం స్ధానంలోనూ అభ్యర్ధిని ప్రకటించింది. ఈ సీటు కోసం దాదాపు ముగ్గురి పేర్లను పరిశీలించిన జనసేన పార్టీ.. చివరికి వైసీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరునే ఖరారు చేసింది.
మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తోంది. ఇందులో అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు మాత్రమే ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని, ఇందుకు సంబంధించి సంతృప్తికర ఫలితాలు వచ్చిన అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తారని జనసేన తెలిపింది.

బందరు లోక్ సభ సీటులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన వల్లభనేని బాలశౌరికి సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరుంది. అయితే మరోసారి బాలశౌరిని బందరు నుంచి పోటీకి దింపేందుకు జగన్ ఇష్టపడకపోవడంతో ఆయన వైసీపీకి దూరమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీలో చేరిన ఆయన్ను పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. బందరు సీటు హామీతోనే ఆయన జనసేనలో చేరినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సీటును పవన్ ఇప్పటివరకూ ఖరారు చేయకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ ప్రకటన వచ్చింది.












Click it and Unblock the Notifications