ఎవరి దారి వారిదేనా, పొత్తులపై పవన్ కొత్త ట్విస్ట్ - ఏం జరుగుతోంది..!!
ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని గతంలో తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. పొత్తులు ఇంకా ఖరారు కాలేదని చెప్పుకొచ్చారు. ఒంటరి గా వెళ్తామాన..పొత్తులు ఉంటాయా అనేది ఇంకా తేల్చుకోలేదన్నారు.
బీజేపీ అటు వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలను పవన్ ఎక్కడా ప్రస్తావించ లేదు. బీజేపీ, టీడీపీ ప్రస్తావన లేకుండానే సీఎం పదవి ఇస్తే తీసుకోవటానికి సిద్దమని చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యల్లో ఎందుకీ మార్పు..ఏం జరుగుతోంది.

పవన్ టార్గెట్ సీఎం జగన్: వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను ఓడించటం పవన్ కల్యాణ్ లక్ష్యం. ఇందులో మార్పు కనిపించటం లేదు. తాజాగా వారాహి యాత్ర ప్రారంభించిన తరువాత కత్తిపూడి సభలోనే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగానే పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కానీ, మారిందల్లా పొత్తులు...సీఎం పదవి విషయంలోనే. గతంలో సీఎం పదవికి తాను పోటీ దారుడిని కాదనే విధంగా పవన్ సుదీర్ఘంగ వివరణ ఇచ్చారు.
దీని పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పవన్ సీఎం కావాలని కోరుకొనే వారికి జనసేనాని ఇచ్చిన విశ్లేషణ రుచించ లేదు. తమ నేత కింగ్ లేదా కింగ్ మేకర్ కావాలనేది అభిమానుల కోరిక. దీనికి భిన్నంగా వ్యవహరించిన పవన్.. తరువాత వచ్చిన స్పందనలతో మరోసారి తన ఆలోచన మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా స్పందించారు.

పొత్తులపై నిర్ణయం జరగలేదా: ఈ సారి తాను అసెంబ్లీకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని చెప్పుకొచ్చారు. గతంలో పొత్తుల గురించి అర్దమయ్యేలా వివరించి పొత్తులు ఖాయమని చెప్పిన పవన్ ఇప్పుడు భిన్న వ్యాఖ్యలు చేసారు. ఎంతో మందికి అవకాశం ఇచ్చారని..ఒక్క సారి జనసేన కు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. తాను అవినీతికి పాల్పడనని..నిజాయితీగా పాలన అందిస్తానని చెప్పుకొచ్చారు.
బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి 2014 ఎన్నికల తరహాలో పొత్తుల దిశగా అడుగులు పడుతున్నాయని భావిస్తున్న వేళ..పవన్ వ్యాఖ్చలు కొత్త చర్చలకు కారణమవుతున్నాయి. పొత్తులు ఉండవని చెప్పకపోయినా..ఈ సారి జనసేన ప్రభుత్వం అంటూ తన పార్టీ వరకే పరిమితం అయి మాట్లాడటం ఇప్పుడు టీడీపీ వర్గాల్లొ చర్చకు కారణమైంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన ఒక్కటే అనే భావం దాదాపుగా వచ్చేసింది. కానీ, అమిత్ షా వ్యాఖ్యలు..అచ్చెన్న కామెంట్స్..పవన్ ప్రసంగం చూసిన తరువాత అసలు ఏం జరుగుతోందనే డైలమా కనిపిస్తోంది.

ఎవరి దారి వారిదే అన్నట్లుగా: అందరి లక్ష్యం వైసీపీ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అటు సీఎం జగన్ తాను ఒంటరిగానే బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. పొత్తుల పైన ఇంకా సాగదీయటం అనవసరమనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగానే పవన్ తన వారాహి ప్రచారంలోనే పొత్తులు..ఎన్నికల పైన క్లారిటీ ఇస్తూ యాత్ర సాగిస్తారని టీడీపీ నేతలు కూడా భావించారు. నడ్డా..అమిత్ షా బహిరంగ సభల్లో తమ ప్రసంగాల్లో ఎక్కడా తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రస్తావన చేయలేదు.
ఇటు పవన్ రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రాన్ని ప్రశ్నిస్తానని స్పష్టం చేసారు. అటు బీజేపీ నేతలు టీడీపీతో పొత్తులకు సిద్దమవుతుందనే వాదన నడుమ టీడీపీ ముఖ్య నేతలు వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి. మొత్తంగా ఇదంతా పొత్తుల రాజకీయంలో భాగమా..ఎవరి దారి వారిదేనా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications