ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుకు పవన్ డిమాండ్- మిలట్రీ ఉద్యోగాలు తర్వాతంటూ
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహించి తీరాలన్న జగన్ సర్కారు నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది సర్కారు మూర్ఖత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరోనా వల్ల ఆరోగ్య విపత్తు తలెత్తి ప్రజలంతా తీవ్ర భయాందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తోందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏపీలోని పలు విద్యాసంస్దల్లో విద్యార్ధులు ఇప్పటికే వైరస్ బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించారన్న ప్రభుత్వ నిర్ణయం మూర్ఖత్వం అని అర్ధమవుతోందన్నారు. కరోనా విజృంభణ సమయంలలో పరీక్షల నిర్వహణ చూస్తుంటే ప్రజల యోగక్షేమాలపై, ఆరోగ్యంపై ప్రభుత్వానికి బాధ్యత లేనట్లుందన్నారు.

ఈ ఏడాది టెన్త్, ఇంటర్ విద్యార్ధులు కలిపి దాదాపు 16 లక్షల మంది ఉన్నారని, వారంతా పరీక్షలకు వెళ్లి రావడం వల్ల వారి కుటుంబాలు కూడా వైరస్ బారిన పడతాయని, వీరందరినీ ప్రభుత్వం కరోనా ముప్పులోకి నెడుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం సమర్ధించుకుంటున్న తీరు కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. పదో తరగతి పరీక్షలు పెట్టకపోతే మిలటరీ ఉద్యోగాలు కోల్పోతారని చెప్పడం అర్ధరహితమని పవన్ అన్నారు. ఇప్పటికే సీబీఎస్ఈతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ సర్కారు కూడా టెన్త్ పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వారికి లేని ఇబ్బందులు ఏపీకే ఉన్నాయా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications