మోడీ, బాబు సభ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హల్‌చల్
గుంటూరు: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న గుంటూరు ఎన్డిఎ సభలో గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీరు మగ్గురు కలిసి గురువారంనాడు పాల్గొన్న మూడో ఎన్నిక ప్రచార సభ ఇది. గుంటూరు సభలో పవన్ కళ్యాణ్ అభిమానులు హల్‌చల్ చేశారు. తమ ఉత్సాహాన్ని తట్టుకోలేకపో బారికేడ్లను ధ్వంసం చేశారు.
కాగా, పవన్ కళ్యాణ్ ఈ సభలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీని తిడితే తాట తీస్తానని తాను కెసిఆర్‌కు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తీరు తనకు నచ్చలేదని, పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని ఆయన అన్నారు.
కెసిఆర్ సీమాంధ్ర ప్రజలను బూతులు తిడుతున్నా జగన్ ఒక్క మాట కూడా అనలేదని, సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరావన్ని కాపాడలేని జగన్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని ఆయన అన్నారు. జగన్ సిఎం అయితే రాష్ట్రం మూడు ముక్కలవుతుందని ఆయన అన్నారు. జగన్ చేసింది ఓదార్పు యాత్రలు తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు.

దేశంలో నాయకత్వం లేదని, మోడీ వస్తేనే దేశం అభివృద్ది చెందుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుట్ర రాజకీయాలు చేసేవారిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. తనదీ మోడీది అభివృద్ధి జోడీ అని ఆయన అన్నారు.
కాంగ్రెసు పెద్దలు తెలుగువారిని అవమానించారని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత పివి నర్సింహారావుదని, జీవితకాలమంతా కాంగ్రెసు అభివృద్ధి కోసం పనిచేశారని, అటువంటి పివిని కాంగ్రెసు పార్టీ అవమానించిందని ఆయన అన్నారు. తెలుగువాళ్లను అవమానించడం కాంగ్రెసుకు మొదటి నుంచీ అలవాటని ఆయన అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి తన వద్ద ఫార్ములా ఉందని మోడీ చెప్పారు.












Click it and Unblock the Notifications