నేతలు మాటలు మార్చారు...అందుకే నేను జనంలోకి వచ్చా: పవన్ కళ్యాణ్
శ్రీకాకుళం: పాలకొండ ప్రజలు తమ ప్రేమాభిమానాలతో తనను నలిపేశారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పవన్ పోరాటయాత్ర కొనసాగుతోంది.
పాలకొండలోని దుర్గగుడి నుంచి చెక్ పోస్ట్ వరకు నిర్వహించిన పరేడ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం పాలకొండ బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ, నేతలు తాము ఇచ్చిన మాటలు మార్చారు కనుకనే, తాను జనంలోకి వచ్చానని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదాపై మొదటి నుంచీ చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబడేది కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఉత్తరాంధ్ర...నిర్లక్ష్యం
ఎపి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిందని, అడవిపుత్రులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గిరిజనులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని పవన్ చెప్పారు. ఈ పాలకులు పోవాల్సిందేనన్నారు.

తోటపల్లి రిజర్వాయర్...ప్రస్తావన
ఈ సందర్భంగానే తోటపల్లి రిజర్వాయర్ గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఈ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. రైతులు కంటతడి పెడుతుంటే తనకు ఎంతో బాధ కలుగుతోందని పవన్ భావోద్వేగానికి గురయ్యారు.

పర్యటన...ఇలా
శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర మంచి స్పందన లభిస్తోంది. ఆదివారం నరసన్నపేట, పాతపట్నం పర్యటించిన పవన్ కళ్యాణ్ సోమవారం పాలకొండలో పర్యటించారు. పాలకొండలోని దుర్గగుడి నుంచి చెక్ పోస్ట్ వరకు నిర్వహించిన పరేడ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొని అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

ప్రధానంగా...టిడిపినే లక్ష్యం
గతంలో టిడిపిని కాకుండా వైసిపిని టార్గెట్ చేసి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడపాదడపా తప్ప వైసిపి ప్రస్తావన తేవడం లేదు. ఇప్పుడు పవన్ విమర్శలన్నీ ప్రధానంగా టిడిపి ప్రభుత్వాన్ని ఉద్దేశించే సాగుతున్నాయి. ఉద్దానం సమస్య నేపథ్యంలో తన డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోవడం పవన్ ను మరింత ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications