పవన్ కళ్యాణ్ Vs షర్మిల, 'సిఎం'పై తెరాస కొత్త మెలిక
హైదరాబాద్: సీమాంధ్రలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపిల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కూడా ఆయనకు ధీటుగానే స్పందిస్తున్నారు.
తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీమాంధ్ర ప్రజల్ని బూతులు తిడుతుంటే తాను సీమాంధ్రుడ్ని అని చెప్పుకున్న జగన్ ఎందుకు స్పందించలేదని పవన్ ప్రశ్నించారు. కెసిఆర్ అంటే జగన్‌కు భయమా అని నిలదీశారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో ప్రజలపై విపరీతమైన ప్రేమ కలిగిందని ఎద్దేవా చేశారు.

అందుకే జగన్ ఓదార్పు యాత్ర ఎంతకీ తెగడం లేదన్నారు. తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో జగన్ రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారని విమర్శించారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయన్నారు. తనపై దాడులకు దిగితే తలవంచుతానని చెప్పారు.
తాను దాడికి దిగాలంటే కత్తులు, కొడవళ్లు అక్కర్లేదని, తన అభిమానులతో కలిసి నడిచి వెళ్తే చాలన్నారు. అభిమానులు గుండెల్లో ఇచ్చిన స్థానం ముందు సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవి ఎక్కువా అని పవన్ ప్రశ్నించారు. ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో తనకు చాలామంది సలహా ఇచ్చారన్నారు.
అయినా సరే తాను ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని ఉద్యమం సమయంలో ప్రజల్లోకి రాలేదన్నారు. పార్లమెంటు సాక్షిగా సీమాంధ్ర ఎంపీలపై దాడి జరుగుతుంటే కడుపు రగిలిపోయిందన్నారు. తనపై విపరీత వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నానని, పౌరుషం, తెగువ, తెగింపు ఉన్నది కేవలం కెసిఆర్ కుటుంబానికేనా? అన్నారు. దేశం, ప్రజలు, సమాజం తనకు ముఖ్యమన్నారు.
పవన్ కళ్యాణ్ పైన షర్మిల, మైసూరా రెడ్డి వంటి నేతలు కూడా ఎదురు దాడికి దిగారు. విభజనకు మద్దతిచ్చిన టిడిపి, బిజెపిలకు పవన్ కళ్యాణ్ ఏ మొహం పెట్టుకొని సహకరిస్తున్నారని, ఆయన మాటలు సీమాంధ్ర ప్రజలు వినడం లేదని వారు ఎద్దేవా చేశారు.
తెలంగాణ సిఎంపై తెరాస ట్విస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి శుక్రవారం స్పందించారు. తెలంగాణ తొల సిఎం దళితుడని చెప్పినప్పటికీ.. తెలంగాణ తొలి ప్రభుత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో చిక్కులుంటాయని, కాబట్టి కెసిఆర్ మాత్రమే సమర్థుడని కడియం అన్నారు. తెలంగాణ అవసరాలు తీర్చే వారికే తాము కేంద్రంలో మద్దతిస్తామన్నారు. తొలి సిఎం కెసిఆర్ అనివార్యమన్నారు.












Click it and Unblock the Notifications