pawan kalyan jana sena andhra pradesh teachers పవన్ కళ్యాణ్ జనసేన ఆంధ్రప్రదేశ్ మద్యం ఉపాధ్యాయులు politics
లిక్కర్ ఫ్రెండ్లీ స్టేట్: కరోనా వేళ ఇలాంటి దారుణాలా?: జగన్‌కు పవన్ కళ్యాణ్ చురకలు
అమరావతి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఏపీ సర్కారు మద్యం దుకాణాలు తెరవడంపై నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో మద్యం షాపులు తెరిచి మరింత ఆందోళనకర పరిస్థితికి తీసుకెళతారా? అంటూ ప్రతిపక్షాలతోపాటు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీకి ఆ పరిస్థితి రావడం బాధాకరమే: జగన్ సర్కారు లక్ష్యంగా పవన్ కళ్యాణ్
ఏపీ సర్కారు కరోనా ఫ్రెండ్లీగా..
తాజాగా ఏపీ సర్కారు తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీ సర్కారు కరోనా ఫ్రెండ్లీగా మారిందంటూ ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని మార్చి.. ఇప్పుడు దశలవారీగా నిషేధం తీసుకొచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. కరోనావైరస్ వ్యాపిస్తున్న ఇలాంటి సమయంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు. కానీ, మద్యం దుకాణాల్ని తెరవడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దాని ఫలితమే ఇదంటూ వైన్ షాపుల ముందు బారులు తీరిన మందుబాబుల వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు పవన్ కళ్యాణ్.

మద్యం షాపులకు ఉపాధ్యాయులు గార్డులు గానా?
అంతేగాక, మద్యం దుకాణాల వద్ద విద్యార్థులకు చదువులు చెప్పే ఉపాధ్యాయులను ఎలా ఉంచుతారని నిలదీశారు పవన్ కళ్యాణ్. భావి పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులకు ఇవేం విధులని నిలదీశారు. మంగళవారం ఆయన విజయవాడ, చిత్తూరు జిల్లా నాయకులతో పవన్ కళ్యాణ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకో, పేదలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం వంటి వాటిని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులను ఉపయోగించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయులను మద్యం షాపులకు గార్డులను చేసిందని మండిపడ్డారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నేటి ఉపాధ్యాయుల పరిస్థితిని చూస్తే ఆవేదన వ్యక్తం చేస్తారని అన్నారు.
అంతా బూడిదలో పోసిన పన్నీరేనా?
ప్రజలు ఆలయాలు, మసీదులు, చర్చీలకు వెళ్లకుండా, పండగలు చేసుకోకుండా నిబంధనలు పాటిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలు తెరవడం ద్వారా ఇంతకాలం పాటించిన లాక్ డౌన్ నియమాలను, ఆ స్ఫూర్తిని బూడిదలో చేసిన పన్నీరులా మార్చేసిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మద్యం దుకాణాలు కారణంగా పేద ప్రజల ప్రాణాలు పోతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీని కరోనా ఫ్రెండ్లీ స్టేట్‌గా మార్చేశారు..
రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా.. కరోనా కేసుల్లో ముందుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయి నాయకులతో సోమవారం రాష్ట్రంలో పరిస్థితిపై మాట్లాడినట్లు తెలిపారు. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా చేయడం, ఆ దుకాణాల దగ్గర జనం సామాజిక దూరం పాటించేలా చూడకపోవడం, ప్రజాప్రతినిధుల ర్యాలీలు చేయడం గురించి ప్రస్తావించినట్లు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ కరోనా ఫ్రెండ్లీ స్టేట్'గా మారిందన్నారు.
తమిళనాడు సరిహద్దులో గోడలు అందుకే..
కాగా, ఏపీలో కరోనా తీవ్రత చూసి తమిళనాడులోని వేలూరు జిల్లా అధికారులు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో గోడ కట్టేశారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడిలో చిత్తశుద్ధి లేదనే పొరుగు రాష్ట్రం గోడకట్టేసిందని ఎద్దేవా చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలు, కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.