చంద్రబాబు తో పవన్ భేటీ, బీజేపీ పొత్తు సందేశం - సీట్లపై ఫైనల్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పార్టీలు ఎన్నికల సమరంలోకి దిగుతున్నాయి. కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. వైసీపీ తమ అధికారం ఖాయమనే ధీమాతో ఉంది. టీడీపీ -జనసేన తమ పోరాటం లో బీజేపీ కలిసి రావాలని కోరుతున్నాయి. బీజేపీని ఒప్పించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబుతో పవన్ భేటీ కానున్నారు. పొత్తులు..సీట్లు..మేనిఫెస్టోతో పాటుగా ఇద్దరూ కలిసి సభల్లో పాల్గొనే నిర్ణయాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇద్దరు నేతల భేటీ: దాదాపు మూడు నెలలుగా రాజకీయ కార్యకలాపాలకు ప్రత్యక్షంగా దూరంగా ఉన్న చంద్రబాబు తిరిగి ఎన్నికల కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడిని సందర్శిస్తారు. ప్రత్యక పూజలో పాల్గొంటారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఈ రోజు చంద్రబాబుతో భేటీ కానున్నట్లు సమాచారం. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పైన విడుదల అయిన తరువాత హైదరాబాద్ లో పవన్ పరామర్శించారు.

రాజకీయంగా చర్చ జరగలేదు. ఈ రోజు జరిగే భేటీలో పూర్తిగా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు నేతలు కలిసి ఇక ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. దీని కోసం మూడు రీజియన్లలో మూడు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ముందుగా రెండు పార్టీల కేడర్ మధ్య సఖ్యత..సానుకూల వాతావరణం కల్పించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
బీజేపీతో పొత్తు దిశగా: వైసీపీ సంక్షేమ ఓట్ బ్యాంక్ తమను గెలిపిస్తుందనే ధీమాతో ఉంది. దీనికి కౌంటర్ టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ వ్యూహాలకు ధీటుగా ప్రజల్లోకి వెళ్లే అంశాలపైన ఈ ఇద్దరు నేతలు చర్చించనున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు అంశం పైన ఇప్పటికే పవన్ చేస్తున్న ప్రయత్నాలు..బీజేపీ మూడ్ గురించి చంద్రబాబుకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఫలితాల తరువాత బీజేపీ అధికారికంగా పొత్తుపైన నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని పవన్ నమ్ముతున్నారు. టీడీపీలో మాత్రం బీజేపీతో పొత్తు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమయంలోనే పవన్ మరో సారి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ నేతలను కలవనున్నారు.

ఉమ్మడి కార్యాచరణ: బీజేపీ పొత్తు ఉంటుందనే కారణంతో సీట్ల పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినా అధికారికంగా ప్రకటన చేయటం లేదు. జనసేనకు 30 అసెంబ్లీ..2 లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీతో..ఏపీలో టీడీపీతో పొత్తుల పైనా పవన్ ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు.
అదే సమయంలో పొత్తుల గురించి ఎవరైనా భిన్నంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ తో పొత్తు లేకపోతే ఎన్నికల వేళ జగన్ ను ఎదుర్కోవటం కష్టమనే అభిప్రాయంతో ఈ ఇద్దరు నేతలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో..మేనిఫెస్టో..ఓటర్ల జాబితా..ప్రచారం..సీట్ల ఖరారు పైనా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ భేటీ పైన రెండు పార్టీల్లో ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications