చంద్రబాబుతో పవన్ భేటీ - కీలక నిర్ణయాలు..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. వరుణ్ తేజ్ వివాహం కోసం ఇటలీ వెళ్లిన పవన్ తిరిగి వస్తూనే చంద్రబాబును కలిసారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన తరువాత పవన్ టీడీపీ - జనసేన పొత్తు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పవన్ సమావేశమయ్యారు. ఇప్పుడు చంద్రబాబును కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసిన పవన్.. కీలక అంశాల పైన చర్చించినట్లు సమాచారం.
ఇద్దరు నేతల సమావేశం: టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పవన్ సమావేశమ్యారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పైన విడుదల అయ్యారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో, పవన్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం పై వాకబు చేసారు.

పార్టీ నేత మనోహర్ తో కలిసి వెళ్లిన పవన్ కల్యాన్.. తాజా రాజకీయ పరిస్థితుల పైన చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని వచ్చారు. మంగళవారం నాడు కంటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా ఆరోగ్యం పైన శ్రద్ద పెట్టాలని పవన్ చూసించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికలపై చర్చ: టీడీపీతో పొత్తు ప్రకటన తరువాత బీజేపీ నేతలను కలిసి ఏ పరిస్థితుల్లో తాను పొత్తు ప్రకటించాల్సి వచ్చిందో చెబుతానని పవన్ చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్దం అయిన వేళ బీజేపీ నేతలు సంప్రదించారు. పరస్పర సహకారంతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
అందులో భాగంగా పవన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించారు. రెండు పార్టీలు సీట్ల అంశం పైన చర్చించి నిర్ణయానికి రావాలని షా సూచించారు. ఫలితంగా జనసేనకు తెలంగాణలో బీజేపీ 8 లేదా 9 సీట్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీని పైన పవన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సమయం లో తెలంగాణ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ కు సహకరిస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
వైసీపీ పై ఉమ్మడి పోరాటం: ఇటు జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. కానీ, ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన చంద్రబాబు - పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో ఏపీ పైన ఫోకస్ చేస్తానని పవన్ చెప్పినట్లు సమాచారం.
ఈ నెల 8న సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కానుంది. కోర్టు తీర్పుకు అనుగుణంగా చంద్రబాబు కేసుల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుప్రీం తీర్పు తరువాత ఏపీ రాజకీయాల్లో టీడీపీ -జనసేన సమన్వయంలో మద్యం, ఇసుక అంశాలపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications