2014: విభజన, కేసీఆర్ ఒక్కడు, మోడీ-పవన్-బాబు కలిస్తే 111! చిరుపైనే ఆశ
హైదరాబాద్: 2014 ఎన్నో తీపిగురుతులను, చేదును మిగిల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కోట్లాది తెలుగు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తే, సీమాంధ్రలోని సమైక్యవాదులకు ఆవేదనను మిగిల్చింది! జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే అయినప్పటికీ ఇంకా విభజన పూర్తిగా పరిపూర్ణం కాలేదనే చెప్పవచ్చు. ఐఏఎస్ అధికారుల విభజన పూర్తికాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో పాలన గాడిన పడలేదు.
అపాయింటెడ్ డేకు ముందే అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు వచ్చాయి. దీంతో అధికారిక విభజనకు ముందే ఎన్నికల ప్రచారంలో అది ప్రాముఖ్యతను సంతరించుకుంది. తెలంగాణలో తెరాస, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. తెలంగాణలో బీజేపీతో జత కట్టడం వల్ల టీడీపీ కొన్ని సీట్లతో గట్టెక్కింది. అదే సమయంలో బీజేపీ నష్టపోయిందనే వాదనలున్నాయి. తెలంగాణలో, ఏపీలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రచారం బీజేపీ-టీడీపీ కూటమికి కలిసి వచ్చింది.
ముఖ్యంగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు పవన్ ప్రచారం బాగా ఉపయోగపడిందని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీలు పవన్‌ను గుర్తించారు కూడా. పవన్, చంద్రబాబులతో కలిసి పాల్గొన్న ఓ ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ.. తాము ముగ్గురం కలిస్తే మూడు కాదని, 111 అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పవన్ అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టలేకపోయారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని ప్రచారం చేసుకోకపోవడం వల్ల తెలంగాణలో, విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోయింది. ఇక, ఏపీలో అధికారంలోకి వస్తామని వైయస్ జగన్, ఆయన పార్టీ బాగా ఆశలు పెట్టుకుంది. కానీ, పవన్, మోడీ, చంద్రబాబుల కలయిక వల్ల అది సాధ్యం కాలేదు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తీసుకు వచ్చారనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారు.

విభజన
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. ఇది ఓ వైపు సంతోషాన్ని, మరోవైపు ఆవేదనను మిగిల్చింది! అపాయింటెడ్ డే జూన్ 2.

మోడీ - పవన్ - బాబు
నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కలయిక విభజిత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని అధికారంలోకి తీసుకు వచ్చింది. విభజన అనంతరం చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని కూడా ప్రజలు భావించారు.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు ఏపీలో తాము అధికారంలోకి ఖాయమని భావించారు. కేసీఆర్ కూడా ఫలితాలకు ముందు తెలంగాణలో మేము, ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారని చెప్పారు. కానీ ఆయన లెక్క తప్పింది.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ ఆశించిన స్థానాలు గెలువలేదు. ఏపీలో అయితే ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.

చిరంజీవి
ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని చెప్పవచ్చు. ఆ పార్టీ నేతలు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ చిరంజీవి పైనే ఇప్పటికీ ఆశలు పెట్టుకుందని చెప్పవచ్చు.

కిరణ్ కుమార్ రెడ్డి
ఏపీ విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడిన కిరణ్ కుమార్ రెడ్డి జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టిని పోటీ చేశారు. కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడు ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు.

కేసీఆర్, బాబు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పోటా పోటీ నెలకొంది. పోలవరం, రాజధాని, ఉమ్మడి రాజధాని, నీరు తదితర అంశాలపై రగడ జరుగింది.. జరుగుతోంది.

రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఏర్పాటు కానుంది. ఈ రాజధానిని ప్రపంచస్థాయిలో నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందు కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి బిజీగా గడిపారు. అయితే, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి నేతలు క్యూ కట్టారు. టీడీపీ, బీజేపీ నేతలు తమ గెలుపులో ఆయన పాత్ర ఉందని ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్ ధాటికి కాంగ్రెస్, టీడీపీలు నిలువలేకపోయాయి. ఏపీలో జగన్ అధికారంలోకి వస్తాననుకున్నప్పటికీ 67 సీట్లతో సరిపుచ్చుకున్నారు. మరోవైపు, ఇరు రాష్ట్రాల్లో విపక్ష నేతలు పలువురు ఆధికార పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications