ప్రశ్నించలేకనే: విశాఖ జనసేన సభపై పవన్ కల్యాణ్ ఆనాసక్తి
విశాఖపట్నం: ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ మార్చి 14వ తేదీన విశాఖఫట్నంలో ఆయన అభిమానులు తలపెట్టిన జనసేన వార్షికోత్సవ సభ పట్ల అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ అభిమానులు మార్చి 14వ తేదీన విశాఖపట్నంలో పెద్ద యెత్తున జనసేన ప్రథమ వార్షికోత్సవ సభ నిర్వహించాలని తలపెట్టారు.
ఆ రోజు ఎవరికీ అందుబాటులో కూడా ఉండకూడదని పవన్ కల్యాణ్ నిర్ణయించకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత దాన్ని బలోపేతం చేయడానికి పవన్ కల్యాణ్ ఏ విధంగానూ ప్రయత్నించలేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధపడలేదు.

ఎవరిని ప్రశ్నించడమనే మీమాంసలో పవన్ కల్యాణ్ పడినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గానీ, ప్రధాని నరేంద్ర మోడీని గానీ ప్రశ్నించేందుకు ఆయన ఇప్పటికప్పుడు సిద్ధంగా లేరని చెబుతున్నారు. దాంతో పార్టీ వార్షికోత్సవ సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
పైగా, కాపు సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆ సమస్యపై ఆయన తప్పకుండా స్పందించాల్సి ఉంటుంది. చెప్పాల్సిన విషయమేదో ఇప్పటికే చెప్పినందున అంతకు మించి చెప్పడానికి ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు. అయితే, పవన్ కల్యాణ్ అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లుతారా, వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తారా అనేది చూడాల్సిందే.












Click it and Unblock the Notifications