బాబుపై ట్వీట్: చిరంజీవిలా పవన్ కళ్యాణ్ నష్టపోతున్నారా!?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కోసం, ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఇమేజ్‌ను కోల్పోయే పరిస్థితి కనిపిస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడమే కాకుండా, విస్తృతంగా ప్రచారం చేశారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం పవన్ రెండుమూడుసార్లు మాత్రమే బయటకు వచ్చారు! గత నెలలో రాజధాని కోసం భూసమీకరణను వ్యతిరేకిస్తూ ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు. టీడీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం దానిపై ఇప్పటి వరకు మాట్లాడలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అంతేకాకుండా, చంద్రబాబు మరో ఇరవయ్యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పడం విడ్డూరమని విపక్షాలు అప్పుడే ప్రశ్నించాయి. తాజాగా, భూసమీకరణ పైన మరోసారి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగిస్తే రైతులకు మద్దతుగా పోరాడుతానని మరోసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అప్పుడప్పుడు ఇలా వచ్చి ప్రశ్నించడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, పవన్ రాజకీయ ట్వీట్ల పైన అభిమానులు కూడా అంత సంతోషంగా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కోసం పవన్ తన రాజకీయ ఇమేజ్‌ను ఫణంగా పెడుతున్నారనే వారు లేకపోలేదు. ప్రభుత్వం పైన పోరాటం చేయాలనుకుంటే బయటకు రావాలని, అప్పుడప్పుడు స్పందించడం కాదని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని కలపడం ద్వారా చిరంజీవి ఇమేజ్ దెబ్బతిన్నట్లు, పవన్ కళ్యాణ్ రాజకీయ ఇమేజ్ కూడా దెబ్బతింటుందని పలువురు అంటున్నారు.
ఇప్పటికే టీడీపీ కోసం పవన్ కళ్యాణ్ 'రాజకీయం' చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, పవన్ ఏం చేసినా కరెక్టుగానే చేస్తారని, సామాన్యుల ఆవేదన తన దృష్టికి వచ్చినప్పుడు ఆయన స్పందిస్తున్నారని, త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారని అభిమానులే కాకుండా చాలామంది భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications