ఢిల్లీ ఆందోళనల పై పవన్ కీలక వ్యాఖ్యలు - హైజాక్ చేస్తున్నారు...!!
నీట్ ఆందోళనలపై ఎపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పదించారు. విద్యార్థుల ఆందోళనను దారి మళ్లించారని ఫైర్ అయ్యారు. అదే సమయంలో విద్యార్థుల నిరుద్యోగం, విద్యా సంబంధిత సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పవన్ సూచించారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
నీట్ పరీక్ష పత్రాల లీక్.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ పరిణామాల పైన డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ప్రజాస్వామ్య నిరసనను హింసాత్మకంగా మార్చే ప్రయత్నాలను తప్పుబట్టారు. తాను ప్రజాస్వామ్య నిరసనలకు మద్దతిస్తాననే విషయంతో పాటు, దేశ వ్యతిరేక కార్యకలాపాలను కూడా వ్యతిరేకిస్తానని పవన్ తేల్చి చెప్పారు. నీట్ లీకేజీపై విద్యార్థుల ఆందోళనతో మొదలైన నిరసన, ఇప్పుడు రాజకీయ అజెండా ఉన్న విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్లి దారి తప్పిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమంగా ప్రారంభమై, రాళ్లు రువ్వడం వంటి హింసాత్మక ఘటనలకు దారి తీసిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో యువతలోని అసహనం కేవలం పరీక్షల వల్లే కాదని, భవిష్యత్తుపై అభద్రత వల్ల వచ్చిందని పవన్ విశ్లేషించారు.

కేంద్రం చర్చలకు సిద్దమైనా
ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఆశించే దేశం.. శతాబ్దాల క్రితం రూపొందించిన విద్యా విధానంతో ముందుకు సాగలేదని పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యం భిన్నాభిప్రాయాలతో పాటుగా శాంతియుత నిరసనలను స్వాగతిస్తుందని చెప్పారు. హింస, ఆస్తుల విధ్వంసం, మతపరమైన అవమానాలకు మరియు దేశ సమగ్రతకు సవాలు చేసే నినాదాలకు ఇక్కడ స్థానం లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి సముఖత వ్యక్తం చేసిందని, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆందోళనకారులతో చర్చలు జరిపారని చెప్పారు. నిర్మాణాత్మక చర్చలు కొనసాగకుండా కొన్ని శక్తులు ఆందోళనలను రెచ్చగొట్టి దారి తప్పించాయని, ఫలితంగా ప్రజాస్వామ్య ఉద్యమం, ప్రజా శాంతికి విఘాతం కలిగించే గందరగోళంగా మారిందని పవన్ విశ్లేషించారు. వారి లక్ష్యం చర్చలా లేక అస్థిరతను సృష్టించడమా అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించడానికి జరిగే ప్రతి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.













Click it and Unblock the Notifications