ఆ బాధ్యత మాదే - చంద్రబాబు కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత, కూటమి ప్రభుత్వానిదే అని చంద్రబాబు స్పష్టం చేసారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని... డబుల్ ఇంజిన్ సర్కార్‌తో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నామని వివరించారు. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలు గా ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో జెట్ స్పీడుతో ముందుకు సాగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ, మంగళగిరి, నేడు విజయవాడలో ఇన్ని వేల మందికి పట్టాలు ఇవ్వడం జీవితంలో మరచిపోలేనని చెప్పారు. అరవై వేల మందికి పట్టాలు ఇచ్చామన్నారు. రిజిస్ట్రేషన్ విలువ రూ.19 వేల కోట్లు కాగా.. మార్కెట్ విలువ రూ.52 వేల కోట్లని వెల్లడించారు.

130 చ.గ లు యావరేజ్‌ను ఇచ్చామని, సరాసరి కోటి నుంచి రెండు కోట్ల ఆస్తిని అప్పగించామని సీఎం తెలిపారు. అందుకే పేదలకు పట్టాభిషేకమని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. యాభై, అరవై ఏళ్ల కలను సాకారం చేశామన్నారు. నిన్నటి వరకు ఆస్తి ఉన్పప్పటికీ దానిని ఉపయోగించే పరిస్థితి లేదని.. ఇప్పుడు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పేదల సంతోషమే నిజమైన అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వారికి పట్టాలు ఇచ్చామని.. ఇందుకు కృషి చేసిన వారికి కృతజ్ఞత చెప్పాలని సూచించారు.
తాము ఎన్నికలలో సుపరిపాలన అందిస్తామని చెప్పామని..సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేసారు. కూడు, గూడు, గుడ్డ పేదలకు ఇవ్వాలని అన్న ఎన్టీఆర్ మొదలు పెట్టారని.. అదే విధానాన్ని తాము అమలు చేసి పేదల గుండెలో ఆనందాన్ని నింపామని చెప్పారు. అబ్జక్షన్ లేని భూములను పేదలకు ఇవ్వాలని నిర్ణయించి అమలు చేశామన్నారు. 'ఇది వారసత్వ హక్కు.. మీరు అమ్ముకోవద్దు.. కాపాడుకోలని సూచించారు. పేదలు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని ఆనందంగా జీవించాలన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలను సులభతరం చేశామని చెప్పారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత, కూటమి ప్రభుత్వానిది. గతంలో ఎందరో ప్రయత్నాలు చేసినా పట్టాలు మాత్రం ఇవ్వలేదన్నారు. ఇంటిపట్టాల విషయంలో 120 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపామని చంద్రబాబు తెలిపారు.














Click it and Unblock the Notifications
