కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. రబీ పంటలకు మద్దతు ధర పెంపు
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతన్నలకు శుభవార్త చెబుతూ.. రాబోయే రబీ మార్కెటింగ్ సీజన్ (2027-28) కోసం ఆరు రకాల ప్రధాన రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నదాతల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా, వారి ఆదాయాన్ని మరింత పెంచేలా ఈ పెంపుదల ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏ పంటకు ఎంత పెరిగింది?
పెంచిన మద్దతు ధరల వివరాలను పరిశీలిస్తే.. కుసుమల (Safflower) పంటకు క్వింటాల్‌కు అత్యధికంగా రూ. 675 చొప్పున భారీగా పెంచారు. ఆ తర్వాత స్థానంలో ఆవాలు, రేప్‌సీడ్ ధరను క్వింటాల్‌కు రూ. 413 పెంచగా, మసూర్ (కంది/పప్పుధాన్యాలు) ధరకు రూ. 390, బార్లీకి రూ. 136, శెనగలకు రూ. 83 మేర మద్దతు ధరను పెంచారు. ఇక దేశంలో ప్రధాన ఆహార ధాన్యమైన గోధుమల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 25 పెంచి రూ. 2,610కి చేర్చారు. తాజా పెంపుతో గోధుమ మద్దతు ధర రూ. 2,610కి, బార్లీ రూ. 2,286కి, శనగలు రూ. 5,958కి, మసూర్ రూ. 7,390కి, ఆవాలు రూ. 6,613కి, కుసుమలు రూ. 7,215 చొప్పున క్వింటాల్‌కు ఖరారయ్యాయి.

ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువే లాభం.. పంటల మార్పిడికి ప్రోత్సాహం
ఉత్పత్తి వ్యయం ఆధారంగానే ఈ మద్దతు ధరలను నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా సగటు ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే గోధుమలకు 106 శాతం, ఆవాలకు 96 శాతం, మసూర్‌కు 92 శాతం, శనగలకు 59 శాతం, బార్లీకి 58 శాతం, కుసుమలకు 50 శాతం చొప్పున అదనపు లాభం రైతులకు దక్కేలా ఎంఎస్‌పీని ఫిక్స్ చేశారు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచేందుకు రైతులను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. గడిచిన పదేళ్ల కాలంలో రైతుల ఖాతాలకు రబీ పంటల కొనుగోళ్ల ద్వారా భారీ మొత్తంలో నిధులు జమ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
రూ. 2.79 లక్షల కోట్లతో ఇతర కీలక ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఈ సమావేశంలో కేవలం రబీ పంటల మద్దతు ధరలే కాకుండా, దేశాభివృద్ధికి సంబంధించిన ఇతర కీలక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. క్లీన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలను మరింత విస్తరించేందుకు ఉద్దేశించిన 'పీఎం ధారా' (PM DHARA) కార్యక్రమానికి రూ. 1,86,405 కోట్లను కేటాయించారు. అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, ట్రాఫిక్‌ను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి రూ. 1,790 కోట్లతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ మూడు కీలక నిర్ణయాల ద్వారా మొత్తం రూ. 2,79,157 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.













Click it and Unblock the Notifications
