ద్వారంపూడిపై పవన్ శపథం నెరవేరేనా - మారుతున్న సమీకరణాలు..!!
ఏపీలో ఎన్నికల వేళ కాకినాడ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఇక్కడ నుంచి ద్వారంపూడిని గెలవనీయనని జనసేనాని పవన్ శపథం చేసారు. దీంతో, ఈ సారి కాకినాడ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే వైసీపీ అభ్యర్దిగా తిరిగి ద్వారంపూడి పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో ఇక్కడ ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ చెప్పినట్లుగా ద్వారంపూడిని ఓడిస్తారా. ద్వారంపూడి ఏం చేయబోతున్నారు. కాకినాడలో ఏం జరుగుతోంది.
కాకినాడ కేంద్రంగా : కాకినాడ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఇక్కడ వరుసగా రెండు సార్లు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన రెండు పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాకినాడలో ఈ సారి కూటమి గెలుపు పవన్ కు వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం అక్కేడ మకాం వేసి వరుస సమీక్షలు నిర్వహించారు. కాకినాడ నుంచి టీడీపీ అభ్యర్దిగా మాజీ ఎమ్మెల్యే కొండబాబు ప్రయత్నిస్తున్నారు. జనసేన నుంచి ముత్తా శశిధర్ సీటు ఆశిస్తున్నారు.

పవన్ శపథం : 2019 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్ది ద్వారంపూడికి 73,890 ఓట్లు దక్కాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన వనమాడి వేంకటేశ్వరరావుకు 59,779 ఓట్లు వచ్చాయి. జనసేన నుంచి పోటీ చేసిన ముత్తా శశిధర్ కు 30,188 ఓట్లు పోలయ్యాయి. ఈ సారి టీడీపీ, జనసేన కలవటం ద్వారా వైసీపీ అభ్యర్దిని ఓడించాలని భావిస్తున్నాయి. అయితే, ఈ రెండు పార్టీల నుంచి సీట్లు ఆశిస్తున్న అభ్యర్దులు రేసులో ఉండటంతో ఒకరికి సీటు దక్కితే మరొకరి సహకారం ఏంటనేది సందేహాలు వ్యక్తం చేస్తోంది. ద్వారంపూడి వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని చెబుతున్నారు. స్థానిక సామాజిక సమీకరణాలు తమకు కలిసి వస్తాయని టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్దికి ఇక్కడ 35,327 ఓట్లు దక్కాయి.

కలిసొచ్చేదెవరికి : ఈ లెక్కల మధ్య కాకినాడలో కూటమి నుంచి అభ్యర్ది ఎవరినేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. అయితే, ఎవరు కూటమి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమని ద్వారంపూడి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ లో కాపు, మత్స్యకారుల ఓటర్లు గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నారు. స్థానికంగా కొద్ది రోజుల క్రితం ఇంటి స్థలాల పంపిణీ పెద్ద సంఖ్యలో చేసారు. సంక్షేమ పథకాలతో పాటుగా ఇంటి స్థలాల పంపిణీ తమకు కలిసి వస్తుందనేది ద్వారంపూడి అంచనా. ఇదే సమయంలో పవన్ ప్రభావం ఈ నియోజకవర్గంలో ఉంటుందనేది జనసేన వాదన. దీంతో, కాకినాడలో అభ్యర్ది ఖరారు మొదలు ఎన్నికల ఫలితం వరకు రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications