ఏపీ వాలంటీర్ల కేసులో బిగ్ ట్విస్ట్- వెనక్కి తగ్గిన పవన్..!
ఏపీ వాలంటీర్లకూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూ గతంలో నెలకున్న ఓ వివాదం మరికొంతకాలం కొనసాగేలా ఉంది.
విపక్షంలో ఉండగా వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పై గుంటూరు కోర్టులో నమోదైన పరువునష్టం దావా కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఆయన వెనక్కి తీసుకున్నారు. దీనికి హైకోర్టు కూడా అనుమతించింది.

గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరులో వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిల అదృశ్యానికి వారే కారణమని ఆరోపించారు. వాలంటీర్లు సేకరిస్తున్న వివరాలు కొన్ని అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, అది అంతిమంగా మహిళల మిస్సింగ్ లకు కారణమవుతోందన్నారు. దీనిపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేయించింది.
వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో గుంటూరు కోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. అనంతరం పవన్ కళ్యాణ్ ఈ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజా విచారణలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. చట్టపరంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ కేసును ఎదుర్కొనేందుకు వీలుగా పిటిషన్ ఉపసంహరణకు అనుమతి కోరారు. దీంతో హైకోర్టు కూడా అంగీకరించింది. తాజాగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో పవన్ గుంటూరు కోర్టులో ప్రభుత్వం తరఫున దాఖలైన కేసుపై ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications