హెలికాప్టర్ మొరాయింపు: ఫోన్లో పవన్, నేతల కంగారు
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సభ రద్దయింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో పవన్ సభ ఏర్పాటు చేశారు. అయితే, ఆయన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పవన్ సభకు హాజరు కాలేకపోయారు. శనివారం ఉదయం పదకొండు గంటలకు ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు.
అదే సమయంలో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోను ఆయన ప్రచారం షెడ్యూల్ శనివారం ఉంది. సాంకేతిక ఇబ్బంది కారణంగా రామగుండం ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లడం లేదు. తాను రాలేకపోతున్నానని, క్షమించాలని కోరారు. బిజెపి అభ్యర్థి రామకృష్ణా రెడ్డిని, టిడిపి పెద్దపల్లి ఎంపి అభ్యర్థి శరత్ బాబులను గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ నేతల కంగారు
ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్‌లో హెలికాప్టర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను కంగారు పెట్టింది. ల్యాండింగ్ సందర్భంగా హెలిపాడ్‌ను గుర్తించడంలో పైలట్ మొదట విఫలమయ్యాడు. దీంతో ఇరవై నిమిషాల పాటు హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో హెలికాప్టర్‌లో ఉన్న నేతలు భయానికి గురయ్యారు. ఆ తర్వాత సురక్షితంగా కిందకు దిగింది.
బిల్యా నాయక్ కూతురు ఆచూకీ లభ్యం
నల్గొండ జిల్లా దేవరకొండ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బిల్యా నాయక్ కుమార్తె హారిక ఆచూకీ లభ్యమైంది. హారిక నుంచి పోలీసులు వివరాలు తీసుకున్నారు. తల్లిదండ్రులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం హారిక అదృశ్యం కావడంతో బిల్యానాయక్ మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హారీక అదృశ్యంలో ప్రతిపక్షాల పాత్ర లేదని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications