పవన్ కు బిగ్ ఛాలెంజ్, ఆ ఓట్ బ్యాంక్ దక్కితేనే - ఆపరేషన్ పిఠాపురం..!!
ఏపీ రాజకీయాల్లో పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది. జనసేనాని పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో పరాజయం చెందిన పవన్ ఈ సారి గెలవాలనే పట్టు దలతో ఉన్నారు. ఇందుకు పిఠాపురం ఎంచుకున్నారు. కానీ, ఈ సారి పవన్ గెలుపులో ఇక్కడ సామాజిక వర్గాల లెక్కలే కీలకం కానున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం వెల్లడించిన లెక్కల ప్రకారం ఓట్ బ్యాంక్ పైన అంచనాలు భిన్నంగా ఉన్నాయి.
పిఠాపురంలో బిగ్ ఫైట్
పిఠాపురంలో ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోరులో బిగ్ ఫైట్ మొదలైంది. అక్కడ జనసేనాని పవన్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ విజయం సాధించింది. కూటమి అభ్యర్దిగా పవన్ పోటీ చేస్తుండటంతో టీడీపీ, బీజేపీ మద్దతిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఇదే మూడు పార్టీల కూటమి అభ్యర్ది, వైసీపీ పైన స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు. ఈ సారి పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే వర్మ మద్దతు దారులు ఆందోళనకు దిగారు. ఆ తరువాత చంద్రబాబు నేరుగా వర్మతో మాట్లాడటంతో...పవన్ కు మద్దతు ఇచ్చేందుకు వర్మ అంగీకరించారు. తాజాగా పవన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు.

సామాజిక లెక్కలే కీలకం
ఇక, పిఠాపురంలో ఎన్నికల వేళ ఇక్కడి సామాజిక సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పవన్‌కు గెలుపు సునాయాసమనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ, కాపు వర్గంతో పాటుగా ఇతర సామాజిక వర్గాలు ఇక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు పిఠాపురంలో 2.28 లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1.13 లక్షలుగా కాగా, 1.14 లక్షల మంది మహిళలు ఉన్నారు. పిఠాపురంలో 28 శాతం వరకు కాపు ఓటర్లుండగా, తూర్పు కాపులు కూడా 10 శాతానికి పైగా ఉన్నారు. 19 శాతానికి పైగా మాల ఓటర్లు, శెట్టి బలిజలు 10 శాతం వరకు ఉండగా, చేనేతలు కూడా 10 శాతానికి కొంచెం అటూ ఇటుగా ఉన్నారు.

కలిసొచ్చేదెవరికి
మత్స్యకారులు, రెడ్డి, యాదవ, మాదిగలు గెలుపు ఓటములపై ప్రభావం చూపించనున్నారు. పిఠాపురంలో ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముదగ్రడ ఆపరేషన్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో పాటుగా జనసేన నుంచి తాజాగా వైసీపీలో చేరిన వారికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. తన పార్టీ అభ్యర్ది వంగా గీత ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గంలో 2009లో గెలిచి ఉండటం..కాపు వర్గంలో ఉన్న పరిచయాలతో పాటుగా.. తాను అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు ఇక్కడ కలిసి వస్తాయని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇక్కడ పూర్తిగా సామాజిక సమీకరణాలే కీలకం కావటంతో..పవన్ వర్సస్ గీత పోరులో ఎవరి మద్దతు ఎవరికి కలిసి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications