మోదీ రాక వేళ పవన్ కు షర్మిల తాజా డిమాండ్..!!
ప్రధాని మోదీ విశాఖ పర్యటన రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. పలు కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో భారీ రోడ్ షో కు ఏర్పాట్లు జరిగాయి. సీఎం చంద్రబాబు, పవన్ తో సహా ప్రధాని రోడ్ షో లో పాల్గొంటారు. దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో ప్రధాని పర్యటన పైన రాజకీయంగానూ కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. పీసీసీ చీఫ్ షర్మిల విశాఖ లో ప్రధాని పర్యటన వేళ కీలక వ్యాఖ్యలు చేసారు.
షర్మిల స్పందన
ప్రధాని విశాఖ పర్యటన వేళ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, ఉద్యోగాలు, పోలవరం అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు. తిరుపతి వేదికగా చంద్రబాబు సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారని గుర్తుచేశారు. కానీ 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని బాబు అడిగిన అంశాన్ని షర్మిల ప్రస్తావించారు.

అమలు చేయలేరా
ఇప్పటి వరకు పలు సందర్భాల్లో చెప్పిన మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులే దంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరూ కలిసి పక్కన పెట్టారని ఆరోపించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని పేర్కొన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని.. పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదని విమర్శించారు. 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని విమర్శించారు. కడప స్టీల్ కట్టలేదని... విశాఖ ఉక్కును రక్షించలేదని దుయ్యబట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదన్నారు.
పవన్ కు డిమాండ్
విశాఖకు వస్తున్న ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని షర్మిల డిమాండ్ చేసారు. అదే విధంగా విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోదీతో పలికించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా నిరసనలు కొనసాగుతున్న వేళ పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. నిరసనలకు దిగే అవకాశం ఉన్న వారి పైన నిఘా పెట్టారు. విశాఖ కేంద్రంగా మోదీ చేసే ప్రకటన పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications