జ్ఞానేశ్వరి ఇంటివద్ద తెలంగాణా జ్యోతిష్యుడి హల్చల్.. అసలేం జరిగిందంటే!
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసు ఇప్పటికీ సంచలనం కొనసాగుతోంది. దాదాపు 13 రోజులుగా పాప జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. పోలీసు బృందాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అన్ని దిక్కులా ముమ్మరంగా గాలింపు చేపట్టినా ఇంకా సానుకూల సమాచారం లభించలేదు.
జ్ఞానేశ్వరి ఇంటివద్ద తెలంగాణా జ్యోతిష్యుడి గందరగోళం
ఈ నేపథ్యంలో తెలంగాణ గద్వాల్‌కు చెందిన ఒక వ్యక్తి తాను జ్యోతిష్యుడినని చెప్పుకుంటూ జ్ఞానేశ్వరి ఇంటి వద్ద గందరగోళం సృష్టించడం కలకలం రేపింది. ఈ అజ్ఞాత వ్యక్తి గత రెండురోజులుగా ఇంటి చుట్టుపక్కల అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. తనను జ్యోతిష్యుడిగా పరిచయం చేసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడాడు.

పాప భూదేవతలో కలిసిపోయిందని వ్యాఖ్యలు
పాప బతికే ఉంది, రాత్రి ఒంటి గంటలోపు తిరిగి వస్తుంది, లేకపోతే ఇక రాదు, పాప భూదేవత ఒడిలో ఉంది, నేను పూజలు చేస్తే త్వరలో వస్తుంది వంటి వ్యాఖ్యలు చేశాడు. మరుసటి రోజు ఉదయం పాప భూదేవతలో కలిసిపోయింది, ఇక చనిపోయింది అని చెప్పి కుటుంబాన్ని మరింత భయభ్రాంతులకు గురిచేశాడు. ఇంటి పై అంతస్తులో నిద్రపోయి, రాత్రి పూజలు చేయాలని ఒత్తిడి చేయడంతో స్థానికులు, కుటుంబం ఆగ్రహం వ్యక్తంచేశారు.
జ్యోతిష్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జ్ఞానేశ్వరి తల్లి భవాని, ఇతర కుటుంబ సభ్యులు ఈ వ్యక్తి ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు. తమ వేదనను అర్థం చేసుకోకుండా ఇలాంటి భయపెట్టే మాటలు చెప్పడం సరికాదని ప్రశ్నించారు. వాగ్వాదం తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతడి నేపథ్యం, ఉద్దేశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బొమ్మలు, సీసీ కెమెరాలు పెట్టి అడవి జంతువుల జాడ కోసం దర్యాప్తు
ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మాంసాహార బొమ్మలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిశీలించారు. కానీ ఎలాంటి జాడ లభించలేదు. స్థానిక చెరువులు, బావులను ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు జల్లెడ పట్టాయి. పెంపుడు కుక్క పోస్ట్‌మార్టం నివేదికపై కూడా పోలీసులు పరిశీలన చేస్తున్నారు. ఈ ఘటన స్థానికులలో తీవ్ర ఆందోళన సృష్టించింది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని చుట్టుపక్కల గ్రామాల్లో ఆలయాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. పోలీసులు ప్రజల సహకారం కోరుతున్నారు. పోలీసు దర్యాప్తు త్వరగా పాప జాడ తెలియజేయాలని స్థానికులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications