చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు - దాడుల వెనుక ఇదీ కారణం..!!
పుంగనూరులో జరిగిన దాడులు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. దీని పైన టీడీపీ అధికార పార్టీ, పోలీసులను టార్గెట్ చేస్తోంది. ఘర్షణల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేసారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ఈ దాడుల పైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
పక్కా స్కెచ్ ప్రకారమే: అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం, పక్కా స్కెచ్ తో తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో దాడులు చేయించారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. దాడుల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. ముందే ప్లాన్ చేసుకున్నట్లుగానే ఈ ఘటనకు కారణమయ్యారన్నారు. గురువారం రాత్రి 10.30 గంటలకు టీడీపీ నేతలు ఇక్కడ మీడియాకు పుంగనూరు పట్టణానికి చంద్రబాబు రావడం లేదని, బైపాస్ మీదుగా వెళ్తున్నామని సమాచారం అందించారని చెప్పుకొచ్చారు.

పోలీసులకు కూడా పుంగనూరుకు రావడంలేదనే చెప్పారని వెల్లడించారు. తమ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు పాలనలో తమకు జరిగిన అన్యాయం పట్ల నిరసన కార్యక్రమం పెట్టుకుని.. ఆయన కోసం ఉదయం 10.30 వరకు ఎదురుచూశారని... కానీ, ఆయన ఇటువైపు రావడంలేదని తెలిసి వారంతా వెళ్లిపోయారని చెప్పారు.
ఉద్దేశ పూర్వకంగానే అటు వచ్చారు: చంద్రబాబు పనిగట్టుకుని .. కావాలని రెచ్చగొట్టడానికి పుంగనూరుకు వచ్చారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకూడదని పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నా రని చెప్పారు. పోలీసులు కూడా సమాచారం లేకుండా ఎలా వస్తారని అడిగినందుకు వాళ్లను రక్తాలు కారేటట్టు కొట్టారని వివరించారు.
పోలీసుల్ని కర్రలతో, రాడ్లతో కొట్టారు. రాళ్లు విసిరి పోలీసుల తలలు పగులకొట్టారన్నారు. వారి జీపులు, వాహనాలను కూడా టీడీపీ వారు దాడులు చేసి ధ్వంసం చేసి తగులబెట్టారని వివరించారు. కిరాయి గుండాల్ని తెచ్చుకుని.. కార్లలో గన్‌లను పెట్టుకుని వచ్చారని ఆరోపించారు. ఆ గన్‌లున్న కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
ఫ్రెస్టేషన్ తోనే దాడులు: చంద్రబాబు దిగజారి వీధిరౌడీలా మాట్లాడటం అలవాటేనన్నారు. అతని ప్రవర్తనను ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు చూశారని పేర్కొన్నారు. చంద్రబాబుకు మతిస్థిమితం లేదన్నారు. విపరీతమైన ఫ్రస్టేషన్‌తో ఊగిపోతూ శాంతిభద్రతల సమస్యల్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ వయసులో చంద్రబాబు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయిస్తాడని ఎవరూ అనుకోరంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు వెంట విజయవాడ నుంచి వచ్చిన అల్లరి మూకలే దాడికి పాల్పడ్డాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తిగా చంద్రబాబునే కారకుడు కనుక.. ఈ దాడుల్లో కేసుల్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబేని పెద్దిరెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications