ప్రతిజ్ఞ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
YS Jagan injury: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరిన ఘటనలో ఆయన గాయపడ్డారు. ఈ ఉదంతం నేపథ్యంలో నేటి బస్సు యాత్రకు విరామం ఇచ్చారు జగన్. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన తన బస్సు యాత్ర నైట్ క్యాంప్‌లో విశ్రాంతి తీసుకుంటోన్నారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే. చీకటి పడ్డాక వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాయి విసిరారు. ఈ ఘటన జగన్ గాయపడ్డారు. ఎడమకంటి పైభాగం, నుదుటిపై గాయమైంది. అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేసుకున్న అనంతరం బస్సు యాత్రను యధాతథంగా కొనసాగించారు.

రాత్రి విరామ సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. గాయానికి కుట్లు వేశారు. మూడు కుట్లు వేసినట్లు సమాచారం. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్లు చేసిన సూచనలకు జగన్ సానుకూలంగా స్పందించడంతో నేటి బస్సుయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
వైఎస్ జగన్ తనపై తానే దాడి చేసుకున్నాడని, ఈ రాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. నారా లోకేష్‌పై ఘాటు విమర్శలు చేశారు.
సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తోన్న అపూర్వమైన ప్రజాదరణను చూసి తట్టుకోలేక టీడీపీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. దీని వెనుక చంద్రబాబు, నారా లోకేష్ హస్తం ఉందని ఆరోపించారు. టీడీపీ కూటమి కట్టినప్పటికీ- ఏ మాత్రం ప్రజల్లో ఆదరణ ఉండట్లేదని, అందుకే వారు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారని పెద్దిరెడ్డి అన్నారు.
నారా లోకేష్ కూడా ఒక్కసారి తనపై తానే దాడి చేయించుకుంటే చూడాలని ఉందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ దాడి రాజకీయ కోణంలోనే జరిగిందని, యాదృచ్ఛికం కాదని పేర్కొన్నారు. ఈ ఎన్నికల అనంతరం టీడీపీ ఉనికి కూడా రాష్ట్రంలో కనిపించకుండా పోతుందని పెద్దిరెడ్డి అన్నారు.
175 నియోజకవర్గాల్లో కూడా తాము ఓడిపోబోతోన్నామనే ఆందోళనతో టీడీపీ కూటమి నాయకులు ఉన్నారని, ఈ దాడితో వారంతా ఓటమిని ముందే అంగీకరించినట్టయిందని వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతామని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications