అవమానాలు భరించా: సీఎం జగన్ గుర్తించడం లేదంటూ ఎమ్మెల్యే పార్థసారథి ఆవేదన
విజయవాడ: పెనమలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి తన పార్టీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించడం లేదని.. ఇది దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని పార్థసారథి చెప్పారు. తాను ఎక్కడ ఉన్నా.. పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.
వైసీపీ సామాజిక బస్సు యాత్ర సభలో పాల్గొన్న పార్థసారథి మాట్లాడారు. నామినేషన్ వేసిన ప్రతీసారి పార్థసారథి ఓడిపోయాడు.. పెనమలూరు తెలుగుదేశందేనని చెప్పుకుంటుంది. కానీ, అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నట్లు పార్థసారథి చెప్పారు. కాగా, వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జీల మార్పులు జరుగుతున్న వేళ పార్థసారథి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, పార్థసారథి వ్యాఖ్యల అనంతరం మంత్రి జోగి రమేష్ వేదిక దిగి వెళ్లిపోయారు. స్థానిక నేతలు ఆపుతున్నా.. ఆగకుండా మంత్రి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కంకిపాడులో జరిగిన సామాజిక సాధికార సభలో వైసీపీ బీసీ ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అలాంటివారు పార్టీలోంచి వెళ్లిపోవచ్చు: మంత్రి అమర్నాథ్ సంచలనం
సీటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు పార్టీ వీడటమే మంచిదని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీటివ్వకపోయినా, పోటీ చేసే స్థానం మార్చినా పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదవాళ్ల భవిష్యత్తు, సంక్షేమమే జగన్‌కు ముఖ్యమని దాని కోసమే సీట్ల మార్పిడి జరుగుతుందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైఎస్సార్సీపీదన్నారు.
గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని వీటిని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఒకరు ఇద్దరు వెళ్లిపోతే పార్టీకి నష్టం జరుగుతుందనేది అమాయకత్వమేనని, ఖాళీ అయ్యేది జనసేన, టీడీపీలు మాత్రమేనని జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించిన మంత్రి.. ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మరారు తప్ప జనసేన, పవన్ కల్యాణ్ నచ్చి వెళ్లినట్టు వంశీ చెప్పలేదని అన్నారు.












Click it and Unblock the Notifications