సీఎం జగన్ ను మోదీ టార్గెట్ చేస్తారా? చిలకలూరిపేటలో కౌంట్ డౌన్, ఫస్ట్ మీటింగ్ కోసం వెయిటింగ్
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల తొలి సంయుక్త సమావేశంపై ప్రధాని నరేంద్ర మోదీ వేదికను పంచుకోనున్నారు. మార్చి 17వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరగనున్న భారీ బహిరంగ సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయనుండగా, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకంపై అవగాహన కుదిరింది.

టీడీపీ- జనసేన-బీజేపీలకు పొత్తు కుదిరిన ఒక రోజు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఆ మూడు పార్టీలను తనదైన శైలిలో ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (ఎస్‌సీఎస్) మంజూరు చేసిందా, ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయ విభజన చేసిన సమయంలో చేసిన ఇతర వాగ్దానాలను నెరవేర్చారా అని వైఎస్ జగన్ ఇటీవలే బీజేపీని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2014 నుండి 2019 మధ్య కాలంలో ప్రతిపక్షంలో ఉన్నారు ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని వైఎస్ జగన్ పోరాడారు. వైఎస్ఆర్ సీపీకి రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని 2019 ఎన్నికల ముందు ఆంధ్రా ప్రజలకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం కావడమే కాకుండా లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది.
ఉభయ సభల్లో ఎన్‌డీఏ ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం ఉన్నందున వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన ప్రత్యేక హోదాను డిమాండ్ నేరవేర్చే స్థితిలో లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరువాత ప్రకటన చేశారు.
మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఎందుకు సాధించలేకపోయారో సీఎం జగన్ మోహన్ రెడ్డి వివరించాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవద్దని, అమరావతిలో రాజధానిని నిర్మించవద్దని కేంద్ర ప్రభుత్వం మీకు చెప్పిందా అని సీఎం జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ను ఇంతకాలం టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు చిలకలూరిపేట బహిరంగ సమావేశంలో నేతలు పూర్తి స్థాయి, ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని కూటమి నేతలు అంటున్నారు. ఎన్డీయేలోకి రాకముందే టీడీపీ, జనసేన పార్టీలు ఆరు హామీలతో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించి బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రధాన కార్యక్రమమైన నవరత్నాల పథకాలను దెబ్బ తియ్యడానికి, దానికిపోటీగా ఈ మినీ మ్యానిఫెస్టో, బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఇప్పుడు చిలకలూరిపేట బహిరంగ సభకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం మీద ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అంటూ ఆంధ్రప్రదేశ్ లోని కోట్లాది మంది ప్రజలు, వైసీపీ నాయకులు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ చేస్తారా ? లేదా ? అని అందరూ చిలకలూరిపేట బహిరంగ సభ కోసం ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications