జనసేన అభిమానులకు పేర్ని నాని సూచనలు..!!
అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వందల కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తికి అండగా నిలవడం ఏమిటంటూ ప్రశ్నించారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటోన్న చంద్రబాబును పవన్ కల్యాణ్ ఓదార్చడానికి వెళ్లాడా? లేక ప్యాకేజీ డీల్ కోసం వెళ్లాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబును ఓదార్చాలనే సెంటిమెంట్ కోసం కాకుండా ప్యాకేజీ సెటిల్‌మెంట్ కోసం పవన్ కల్యాణ్ జైలుకు వెళ్లి చంద్రబాబు పలకరించాడని ఆరోపించారు.

తెలుగుదేశంతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికలకు వెళ్తాడనేది పాతవార్తేనని, ఇందులో ఎలాంటి కొత్తదనం లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు వేసుకున్న ముసుగును ఆయన ఇప్పుడు తొలగించాడంతేనని పేర్కొన్నారు. పొత్తుల విషయంలో పవన్‌కు ఓ క్లారిటీ ఉందని, అది లేనిది బీజేపీకేనని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మనస్తత్వం వాడుకుని వదిలేయడమేననేది పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసునని, గతంలో ఇదే విషయాన్ని ఎన్నో బహిరంగ సభల మీద కూడా చెప్పాడని పేర్ని నాని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడనే విషయం తెలిసి కూడా పొత్తుకు వెళ్తన్నాడంటే ఇది వ్యాపారం కాక మరేమిటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని నేర్పుతానని, వారికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి, వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనమని పేర్ని నాని చెప్పారు. అవినీతి మీద పోరాటం చేస్తాననేది తమ పార్టీ సిద్ధాంతమని చెప్పుకొని, అదే అవినీతికి పాల్పడి విచారణను ఎదుర్కొంటోన్న ముద్దాయిని ఎలా పరామర్శిస్తాడని అన్నారు.

తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీకి వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరో 20 సంవత్సరాల పాటు సీఎం స్థానం నుంచి కదల్చలేరని పేర్ని నాని స్పష్టం చేశారు. 2024లోనే కాదు.. ఆ తరువాత జరిగే ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎంతోమంది యువతీ యువకులు నిజాయితీగా పవన్ కల్యాణ్ వెంట ఉంటూ జనసేన పార్టీ జెండాను మోస్తోన్నారని, వారందరినీ మోసం చేశాడని పేర్ని నాని అన్నారు. ఇన్నాళ్లూ పవన్‌ను నమ్ముకున్న అభిమానుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. పవన్ వెంట తిరిగే అభిమానులు, జనసేన జెండా మోసే కార్యకర్తలను అలగాజనంగా అభివర్ణించిన బాలకృష్ణ, నారా లోకేష్‌తో పొత్తుతో వారు బాధపడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా జనసేన కార్యకర్తలు కళ్లు తెరచుకోవాలని, వాస్తవ పరిస్థితులను గ్రహించాలని పేర్ని నాని సూచించారు.












Click it and Unblock the Notifications