మేము శాశ్వతం కాదు - వాళ్లకు టిక్కెట్లు ఇవ్వరు : కార్యకర్తలను పట్టించుకోవట్లేదు - పేర్ని నాని ..!!
పార్టీ ప్లీనరీ వేదికగా మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ప్రసంగం చేసారు. పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేసారు. మూడేళ్లుగా తమను పట్టించుకోవటం లేదంటూ పార్టీ కార్యకర్తల నుంచి అక్కడక్కడా వినిపిస్తోందని చెప్పారు. అయితే, వారంతా ఎమ్మెల్యేల కోసమే.. మంత్రుల కోసమే పని చేయవద్దని.. జగన్ కోసం పని చేయాలని సూచించారు.
తన లాంటి వాళ్లు వస్తుంటారు..పోతుంటారని..కానీ, పార్టీకి జెండా మోసే కార్యకర్తలే శాశ్వతం అని చెప్పుకొచ్చారు. తన లాంటి వాళ్లంతా రాజకీయం కోసం ..పదవుల కోసం వచ్చే వాళ్లమని.. జగన్ - పార్టీ - కార్యకర్తలు శాశ్వతమని పేర్కొన్నారు. మీరంతా ఎమ్మెల్యేల కోసం పని చేయలేదని..జగన్ కోసం పని చేసారని.. జగన్ పైన అభిమానంతో ముందకొచ్చారని చెప్పుకొచ్చారు.

ఆ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వరు
మీడియా - దుష్ట చతుష్ఠయం తీర్మానంలో ఆయన ప్రసంగించారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న మీడియాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగన్ కోసం కార్యకర్తలు పని చేయాలని...ఇంటింటికి తిరగాలని సూచించారు. సీఎం జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరికీ.. వార్నింగ్ ఇచ్చారని చెప్పారు.
ఇంటింటికీ వెళ్లి పథకాల అమలు తీరు సమీక్షించటానికి ఎనిమిది నెలల సమయం ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే గ్రాఫ్ పెరగకపోతే ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవని స్పష్టం చేశారన్నారు. తాను మూడేళ్లు మంత్రిగా పని చేశానని..తనను పక్కకు తప్పించారని గుర్తు చేసారు. వైసీపీ లోనూ కొందరు చంద్రబాబును సింగిల్ గా రమ్మని సవాల్ చేస్తున్నారని..వాళ్లు సింగిల్ గా రారని.. కలిసి కట్టుగానే వస్తారని తేల్చి చెప్పారు.

మూకుమ్మడిగా వచ్చినా.. జగన్ దే గెలుపు
ఒక్కొక్కరుగా వస్తే జగన్ పచ్చడి చేసేస్తారని వాళ్లకు బాగా తెలుసన్నారు. అందరూ కలిసి వచ్చినా... జగన్ అంటే తగ్గేదే లే అని చెప్పుకొచ్చారు. సోనియాకే జగన్ భయపడలేదన్నారు. చంద్రబాబుతో కలిసి కుట్రలు చేసి 16 నెలలు జైళ్లో పెట్టినా వెనకడుగు వేయలేదన్నారు. సోనియాకే భయపడని జగన్.. ఈ దుష్టచతుష్ఠయానికి భయపడతారా అంటూ ప్రశ్నించారు.
జగన్ అంటే తమకు పిచ్చి అభిమానమని ..కార్యకర్తలు ఎంతో మంది జగన్ సీఎం కావాలని కోరుకొని పని చేశారన్నారు. ఎమ్మెల్యేలు..స్థానిక నాయకత్వం కోసం పని చేయవద్దన్నారు. జగన్ కోసం .. రాష్ట్ర భవిష్యత్ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. తన లాంటి వారికి బీఫాం ఇచ్చి... జగన్ బొమ్మ పెట్టుకొని తామంతా గెలిచామని గుర్తు చేసారు.

జగన్ కోసం పని చేయండి..మా కోసం కాదు
కార్యకర్తలు తమను పట్టించుకోవటం లేదనే అభిప్రాయాలను పక్కన పెట్టి.. జగన్ కోసం పని చేయాలని చేసిన సూచన సమయంలో సభికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. అదే విధంగా చంద్రబాబుతో సహా టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న మీడియా పైన పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
ఈ దుష్టచతుష్ఠయానికి భయపడేదే లేదని..అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్సార్ వరుసగా రెండు సార్లు సీఎం అయ్యారన్నారు. జగన్ సైతం 2019, 2024 లో సీఎంగా గెలుస్తారని చెప్పుకొచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకూ తాను ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తానని పేర్ని నాని ప్లీనరీ వేదికగా తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications