విజయవాడ పినాకినీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
Pinakini Express: విజయవాడ- ఎంంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య నడిచే పినాకినీ ఎక్స్‌ప్రెస్ పై దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజా సమాచారాన్ని ఇచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్‌కు కొత్తగా ఎల్‌హెచ్‌బీ బోగీలను అమర్చారు. ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఈ ఎక్స్‌ప్రెస్‌కు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జర్మనీకి చెందిన లింకె-హాఫ్మన్- బుష్క్ సంస్థ డిజైన్ చేసిన బోగీలు ఇవి. చెన్నై, పంజాబ్‌లోని కపుర్తలా, రాయ్‌బరేలీల్లో గల రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో ఇవి తయారవుతాయి. ఐసీఎఫ్ రూపొందించిన బోగీలతో పోల్చుకుంటే ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మరింత సౌకర్యంగా, విలాసవంతంగా ఉంటాయి.

గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు రూపొందాయి. యాంటీ టెలిస్కోపిక్, అడ్వాన్స్‌డ్ న్యుమాటిక్ బ్రేక్ సిస్టమ్, యాంటీ కొలిషన్ అవాయిడ్ సిస్టమ్ ఇన్- బిల్ట్‌గా ఉంటాయి ఇందులో. సాధారణ ఐసీఎఫ్ బోగీలతో పోల్చుకుంటే బరువు తక్కువ. లైట్ వెయిట్ మెటల్‌ను దీని తయారీలో వినియోగిస్తారు.
2022లో రైల్వేల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వినియోగం మొదలైంది. మొట్టమొదటిసారిగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై మెయిల్‌కు ఈ కోచ్‌లను అమర్చారు. క్రమంగా వీటిని విస్తరిస్తోన్నారు. గతంలో సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఈ బోగీలను సమకూర్చారు. ఇప్పుడు తాజాగా పినాకినీ ఎక్స్ ప్రెస్ కూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
కాగా చెన్నై డివిజన్ పరిధిలోని పొన్నేరి- కవరాయ్ పేట్టై మధ్య ఈ ఇంజినీరింగ్ పనులను చేపట్టింది దక్షిణ రైల్వే. ఫలితంగా ఈ మార్గంలో నడిచే పినాకినీ సూపర్ ఫాస్ట్ సహా పలు రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ మార్పులు ఇదివరకే అమలులోకి వచ్చాయి. ఈ నెల చివరి వరకూ కొనసాగనున్నాయి.
సాధారణంగా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 2:05 నిమిషాలకు బయలుదేరే నంబర్ 12712 పినాకినీ ఎక్స్ ప్రెస్.. అదే రోజు రాత్రి 9:35 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది. తాజాగా చేసిన సవరణల ప్రకారం.. ఈ నెల 12, 16, 19, 23, 26, 30 తేదీల్లో పినాకినీ ఎక్స్ ప్రెస్.. చెన్నై సెంట్రల్ లో 20 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరుతుంది. అంటే మధ్యాహ్నం 2: 05కు బదులుగా 2:25 నిమిషాలకు విజయవాడకు బయలుదేరుతుంది. దానికి అనుగుణంగా విజయవాడకు ఆలస్యంగా చేరుకుంటుంది.
సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్, నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి జంక్షన్ లల్లో ఈ ఎక్స్ ప్రెస్ హాల్ట్ సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. ఆయా స్టేషన్లన్నింట్లో కూడా రోజువారీ కంటే ఆయా తేదీల్లో 20 నిమిషాల పాటు ఆలస్యంగా రాకపోకలు సాగించవచ్చు.












Click it and Unblock the Notifications