గెలిచి మంత్రి అవుతాడునుకుంటే..ఇలా అడ్డంగా దొరికిపోయాడేంటి..?
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి వ్యవహారం గురించే చర్చ సాగుతోంది. పోలింగ్ నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఏపీలో విపరీతమైన చర్చ నడుస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో వైసీపీని కార్నర్ చేస్తూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.
అయితే ఈ ఘటనపై వైసీపీ స్పందించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా నిలుస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోను మాత్రమే బయటపెట్టారని..అంతకుముందు ఆ బూత్‌లో జరిగిన రిగ్గింగ్ గురించి ఎవరూ మాట్లాడటం లేదని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిన్నెల్లి భవితవ్యం ఆధారపడి ఉంది. ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ జీవితంపై నీలినీడలు అలుముకున్నాయి. మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2014,2019 ఎన్నికల్లో విజయం సాధించారు.

ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోన్న తరుణంలో అనూహ్యంగా ఆయన ఈవీఎం ధ్వంసం చేసి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన రాజకీయ జీవితం అయోమయంలో పడినట్టు అయింది. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కాల్సింది. కానీ సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలోనే అత్యధిక విజయాలు నమోదు కావడంతో ఆయనకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయమని అనుకున్నారు.
అప్పటికే మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గం వారు అధికంగా ఉండటంతో పిన్నెల్లికి మంత్రి పదవి లభించలేదు. ఈసారి గెలిచి ఎలాగైనా మంత్రి అవ్వాలని చూసిన ఆయనకు ఈవీఎం ధ్వంసం కేసులో నిరాశే ఎదురైయ్యేలా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పిన్నెల్లి ఓడిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పిన్నెల్లి ఈ ఎన్నికల్లో గెలిస్తే.. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. పిన్నెల్లి గెలిచి పార్టీ కూడా అధికారంలోకి వస్తే జగన్ మంత్రివర్గంలో చోటు మాత్రం దక్కేలా కనిపించడం లేదు. ఈవీఎం ధ్వంసం కేసుతో ఆయన రాష్ట్ర మొత్తం కూడా ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆయనకు కచ్చింతంగా మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు బల్ల గుద్ది చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో పిన్నెల్లి రాజకీయ జీవితం రాబోవు రోజుల్లో మరింత కఠినతరంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.












Click it and Unblock the Notifications